హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. రూ.150 కోట్లు..

- January 29, 2019 , by Maagulf
హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. రూ.150 కోట్లు..

హైదరాబాద్ నాగోల్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో ఏర్పాటు చేసిన ఎంఎల్‌ఎం కంపెనీ మోసాన్ని రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఉప్పల్ కేంద్రంగా మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు అందిందని అన్నారు. శ్రీకాంత్, జన్నా కాంతయ్య, శంకు భాస్కర్ యాదవ్, లంక ప్రియా, వెంకటేశ్వర్ రెడ్డి, అహల్య రెడ్డి, అనిల్ రెడ్డి, అంజయ్య గౌడ్ లు ముఠాగా ఏర్పడి గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు.
 
పల్లీ నూనె తయారు చేసి మార్కెటింగ్ కోసం మాత్రమే అనుమతులు తీసుకున్నారు. గతంలో మహాలైఫ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌ను శ్రీకాంత్ నడిపాడని సీపీ తెలిపారు. యంత్రాలన్నీ గుజరాత్ లోని సురత్ నుంచి తెప్పించాడు. గోడౌన్ లలో బాధితులు ఇచ్చిన నూనెలను నిల్వచేశారు. వీరి ఆస్తులు రూ.150 కోట్లుగా గుర్తించామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. ఒక గొలుసుకట్టు మోసం తర్వాత… అదే తరహాలో మరో మోసం వరుసగా వెలుగులోకి వస్తుండటం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తుంది.

లక్ష రూపాయలు కడితే… అంతే విలువజేసే పల్లీల నుంచి నూనె తీసే గానుగ మిషన్, అదనంగా వేరుశనక్కాయలను కూడా ఇస్తానన్నాడు. ఆ గానుగ మిషన్‌తో చేయాల్సిందల్లా… తాము ఇచ్చిన పల్లీలను ఆడించి నూనె తీయడం.. ఆ నూనెను, పిప్పిని కంపెనీకి అప్పగించడమే.. ఎప్పుడు వేరుశనగలు ఇచ్చినా… కాదనకుండా పట్టించి ఇయ్యాలి. ఇలా చేస్తే… 24 నెలల పాటు నెలకు 20 వేల రూపాయలు చొప్పున ఇస్తామని నమ్మబలికాడు.

గడువు తర్వాత గానుగ యంత్రం కూడా మిగిలిపోతుంది. మరొకరిని చేర్పిస్తే 20 వేలు కమీషన్ కూడా ఇస్తామన్నారు. అంటే.. మొత్తంగా లక్షకు రెండేళ్లలో 4 లక్షల లాభం వస్తుందని ఆశ చూపారు. దీంతో నష్టపోవడమనే ప్రశ్నే తలెత్తదని… కంపెనీ అధినేత శ్రీకాంత్, అతని ఏజెంట్లు జనాలను నమ్మించారు. ప్రధాన నిందితుడు జన్నా శ్రీకాంత్ పాత నేరస్థుడు. ఇప్పటికే అతడిపై పోలీస్ స్టేషన్ లలో వివిధ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com