ఘోర కలి... జవాన్ల మృతిపై స్పందించిన ప్రముఖులు

- February 15, 2019 , by Maagulf
ఘోర కలి... జవాన్ల మృతిపై స్పందించిన ప్రముఖులు

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు పెట్రేగిపోయారు. 2500 మంది పైగా జవాన్లు ప్రయాణిస్తున్న భారీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకొని పెను ఘాతుకానికి పాల్పడ్డారు. అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలలో నింపిన ఎస్‌యువి వాహనంతో సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల బస్సును ఢీకొట్టి రక్తపాతం సృష్టించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెహికల్‌ బోర్న్‌ ఇప్రోవైజ్‌డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (విబిఐఇడి)గా పేర్కొనే అత్యంత శక్తివంతమైన 350 కిలోల పేలుడు పదార్థాలు నింపిన టాటా సుమో/మహీంద్రా స్కార్పియో వాహనంతో సిఆర్‌పిఎఫ్‌ బస్సుపైకి దూసుకెళ్లి పేల్చేయడంతో విధ్వంస తీవ్రతకు పరిసర ప్రాంతమంతా భీతావాహంగా మారింది. తెగిపడిన అవయవాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దాడికి గురైన సిఆర్‌పిఎఫ్‌ వాహనంలో 42 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ప్రధాన కాన్వారుకి కాస్త ముందుగా ప్రయాణించే రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీకి చెందిన మరో ఇద్దరు జవానులు కూడా ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రమూకలు తొలుత సైనికులపై కాల్పులు కూడా జరిపారని సిఆర్‌పిఎఫ్‌ డిజి ఆర్‌ఆర్‌ భట్నాగర్‌ తెలిపారు. ఉగ్ర ఘాతుకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన సిపిఎం పొలిట్‌బ్యూరో ఏ సమస్యలకైనా హింస పరిష్కారం కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో శాంతి చర్చలు జరపాలని కోరింది. 

పుల్వామాలో జవాన్ల కాన్వారుపై దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ బలగాలను, వాహనాలను ధ్వంసం చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి మహ్మద్‌ హస్సన్‌ పేర్కొన్నట్లు రైజింగ్‌ కాశ్మీర్‌ పత్రిక తెలిపింది. కాకాపోరాకు చెందిన అదిల్‌ అహ్మద్‌ ఈ ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. అతడికి అహ్మద్‌ గాడీ టక్రనేవాలా, వక్వాస్‌ కమాండక్ష ఆఫ్‌ గుండీబాగ్‌ అని కూడా పేర్లున్నాయి. పుల్వామా దాడి అనంతరం కొద్దిసేపటికే అదిల్‌ ఫోటోలు, వీడియో ఇంటర్నెట్‌లో పోస్టు చేశారు. జైషే మహ్మద్‌ సంస్థ విడుదల చేసినదిగా చెబుతున్న ఓ వీడియోలో 'నా పేరు అదిల్‌. జైషే మహ్మద్‌లో ఏడాది కిందటే చేరాను. ఏడాది తర్వాత జైషేలో నేనెందుకు చేరానో ఆ అవకాశం ఇప్పుడు దక్కింది. ఈ వీడియో మీరు చూసే సమయానికి నేను స్వర్గంలో ఉంటా' అనే సంభాషణలున్నాయి. 

సెలవుల నుంచి తిరిగి విధులకు వెళ్తూ .. 
కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌)కు చెందిన 2500 మంది పైగా జవాన్లు కాశ్మీర్‌ లోయలో విధులు నిర్వహించేందుకు 78 వాహనాల్లో వెళ్తూ అవంతిపుర సమీపాన లాతూమోడ్‌ వద్ద శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. బస్సు, ఎస్‌వియు ట్రక్కులతో కూడిన ఈ కాన్వారులో ఒక్కొక్క వాహనంలో 35 నుంచి 40 మంది జవాన్లు వరకు ప్రయాణిస్తారు. జమ్మూలో గురువారం ఉదయం 3.30 గంటలకు బయల్దేరిన వీరి కాన్వారు సూర్యాస్తమయం లోగా శ్రీనగర్‌ చేరుకోవాల్సివుండేది. ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడం, మంచు చరియలు విరిగిపడుతుండటం మూలాన రెండు, మూడ్రోజుల నుంచి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో ఒకే సారి ఇంత పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రయాణించాల్సివచ్చిందని అధికారులు తెలిపారు. సాధారణంగా ఒక పర్యాయం వెయ్యి మంది వరకు ఒకే కాన్వారులో వెళ్తారు. ఈ దఫా జవాన్ల సంఖ్య 2547. ఇంతమంది ఒకేసారి కాన్వారులో ప్రయాణించాల్సివచ్చింది. వీరిలో అత్యధిక మంది సెలవులు ముగించుకొని తిరిగి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నవారే. ఇంత భారీ కాన్వారుని కూడా లెక్క చేయకుండా బరితెగించిన ఉగ్రవాదులు ఆత్మాహుతి కారు బాంబు దాడితో పెను విధ్వంసం సృష్టించారు.

హింస సమాధానం కాదు : సిపిఎం 
పుల్వామా దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. సమస్యలు పరిష్కరించడానికి హింస సమాధానం కాదని పేర్కొంది. ఈ మేరకు పార్టీ పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. సమస్యను పరిష్కరించడా నికి రాష్ట్రంలోని అందరు భాగస్వామ్యులతోనూ చర్చలు నిర్వహించాలని సూచించింది. ఈ చర్చలపై మూడేళ్ల కిత్రం మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదని విమర్శించింది. రాజకీయ జోక్యంతో చర్చల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేసింది. జమ్మూకాశ్మీర్‌లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పొలిట్‌ బ్యూరో విజ్ఞప్తి చేసింది. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన సైనికుల కుటుంబాలకు తీవ్ర సానుభూతిని ప్రకటించింది.

దేశమంతా ఐక్యంగా ఉంది : రామ్‌నాధ్‌ కోవింద్‌ 
ఉగ్రదాడిని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ తీవ్రంగా ఖండిచారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఐక్యంగా ఉందని అన్నారు.

దుర్మార్గం, పిరికితం : మోడీ 
దుర్మార్గం, పిరికితనంతో చేసిన దాడిగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత సైన్యం త్యాగాలు వృధా కాదు అని అన్నారు.
దేశ భద్రతపై

రాజీ పడటంతోనే దాడి : కాంగ్రెస్‌ 
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ భద్రతపై రాజీ పడటంతోనే పుల్వామా దాడి జరిగిందని కాంగ్రెస్‌ విమర్శించింది. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దేశ భద్రతపై మోడీ ప్రభుత్వం రాజీ పడటంతోనే యురి, పఠాన్‌కోట్‌, పుల్వామా వంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

మాటలు రావడం లేదు : మెహబూబా ముఫ్తి 
పుల్వామా దాడిని ఖండించడానికి మాటలు రావడం లేదని జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిచ్చి అంతం కావాలంటే ఇంకెంత మంది ప్రాణత్యాగం చేయాలని ఆమె ప్రశ్నించారు. కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి కేంద్రం, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

హేయమైన చర్య : చంద్రబాబు 
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్యని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో సిఆర్పీఎఫ్‌ జవాన్ల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com