ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

- February 20, 2019 , by Maagulf
ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

ఆధారాలు లేకుండానే పుల్వామా ఘటనపై భారత్‌ తమను నిందిస్తోందని పాక్‌‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఆయన మాటలు అబద్దాలని తెలిపోయింది. ఒకవైపు తమకే పాపం తెలీదని చెబుతున్నా.. ఈ దేశం నుంచే కుట్రలు జరిగాయని ఆధారాలు బయడపడుతూనే ఉన్నాయి. దాడికి తామే బాధ్యులమని రెండో వీడియోను కూడా జైషే మహ్మద్ సంస్థ విడుదల చేసింది. ఉగ్రవాదితో పాటు జైషే సంస్థకు చెందిన బ్యానర్‌ కూడా అందులో కనిపించింది. తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పుల్వామా లాంటి దాడులకు పాల్పడతామంటోంది. ఈ వీడియో పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.


 
పుల్వామా ఉగ్రదాడిలో ఆరోపణలన్నీ అవాస్తవమంటూ పాక్‌‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ తరహా ప్రకటనలు ఆ దేశానికి కొత్తకాదన్నారు. వీర జవాన్ల మృతికి సంతాపం తెలపలేదని.. కనీసం దాడిని ఖండించలేదని భారత్‌ గుర్తుచేసింది. మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని సూచించింది. తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటే అప్పుడు చర్చల గురించి ఆలోచిస్తామని భారత్‌ స్పష్టం చేసింది.

ఉగ్రవాద బాధిత దేశం తామే అనడం పాకిస్తాన్‌కు కొత్తకాదన్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదంటోంది భారత్‌. తీవ్రవాదం పాకిస్తాన్‌‌లో ఓ భాగం అన్నారు. పఠాన్‌కోట్‌ దాడి కేసులో ఆధారాలు ఇచ్చినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. హఫీజ్‌ సయీద్‌ వంటి ఉగ్రవాదులతో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వేదిక పంచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించింది భారత్‌. పుల్వామా ఉగ్రదాడిపై భారత్‌ ఆధారాలు సమర్పిస్తే విచారణ జరుపుతామని సాకులు చెబుతున్నారన్నారు. జైషే మహ్మద్ నాయకుడు మసూద్‌ అజర్ ఎక్కడున్నాడో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి తెలీదా అని ప్రశ్నించారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు.

పుల్వామా దాడి ఘటనలో పాకిస్తాన్ పాత్రకు సంబంధించి ఆధారాలు మరింత బలపడుతున్నాయి. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడికి పాల్పడేందుకు వినియోగించిన పేలుడు పదార్థాన్ని పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు తరలించినట్లు నిపుణులు గుర్తించారు. పేలుడు జరిగిన తీరును బట్టి మిలటరీ గ్రేడ్‌ ఆర్‌డీఎక్స్‌ని వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పాక్‌ రక్షణ వర్గాల నుంచే వచ్చిందని.. బయట దొరికే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్డీఎక్స్‌ కొన్ని నెలల క్రితమే భారత్‌కు కొద్దికొద్దిగా తరలించినట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే ఆర్డీఎక్స్‌ తో బాంబులు తయారుచేసినట్టు అంచనాకు వచ్చారు. కమాండర్లు కమ్రాన్‌, ఘాజీల ఎన్‌ కౌంటర్‌ జరిగిన తీరును భట్టి పాకిస్తాన్‌ నుంచి ఆర్డీఎక్స్‌ తీసుకొచ్చి.. బాంబులు ఇక్కడే తయారుచేసినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com