హెచ్‌ఐవీకి కొత్త చికిత్స.. భారతీయ వైద్యుడి కీలక పాత్ర..

- March 06, 2019 , by Maagulf
హెచ్‌ఐవీకి కొత్త చికిత్స.. భారతీయ వైద్యుడి కీలక పాత్ర..

కొందరి చెడు అలవాట్లు.. మరికొందరి అజాగ్రత్త.. ఇంకొందరు దురదృష్టం కొద్దీ హెచ్‌ఐవీ బారిన పడుతుంటారు. ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి ఉపశమనం కోసం ఎన్ని మందులు వచ్చినా పూర్తిగా తగ్గించే మందు ఇంతవరకు రాలేదనే చెప్పాలి. ఒకసారి ఈ వ్యాధి సోకితే మరణించే వరకు మనిషిని నిలువునా కృంగదీసి పీల్చి పిప్పి చేస్తుంది. అందుబాటులో ఉన్న మందులు ఎన్ని వాడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం.

అయితే లండన్‌కు చెందిన ఒక హెచ్‌ఐవీ రోగికి మూలకణ మార్పిడి చికిత్సను అందించడం ద్వారా హెచ్‌ఐవీ వ్యాధి లక్షణాలను పూర్తిగా రూపుమాపారు. భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్రగుప్తా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేపట్టి విషయాన్ని నిర్ధారించారు.

లండన్‌కు చెందిన ఓ వ్యక్తికి 2003లో హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు తెలుసుకున్నారు. అదే వ్యక్తికి 2012లో హాడ్కిన్స్ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ కూడా సోకింది. అతడిపై పరిశోధనలు సాగించిన డాక్టర్ల బృందం చికిత్సలో భాగంగా జన్యు పోలికలు ఉన్న వ్యక్తి నుంచి మూలకణాలను సేకరించి రోగికి మార్పిడి చేశారు. ఆ తరువాత అతడికి 18 నెలలపాటు యాంటీ రెట్రో వైరల్ మందులు ఇవ్వడం ప్రారంభించినట్లు ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా చెప్పారు. చికిత్స అనంతరం మూడు సంవత్సరాలకు వైద్య పరిక్షలు నిర్వహిస్తే అతనిలో హెచ్‌ఐవీ జాడలేవీ కనిపించలేదని తెలిపారు.

అయితే, ఇది అంత సులభమైన వైద్యమేమీ కాదని, హెచ్‌ఐవీ సోకిన వారందరికీ మూలకణ మార్పిడి చేయడం సాధ్యం కాదని రవీంద్ర అంటున్నారు. పైగా ఈ వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని కూడా అంటున్నారు. జన్యు పోలికలు ఉన్న వ్యక్తులు దొరకడం అనేది కూడా సాధారణమైన విషయం కాదని చెప్పారు.

మరిన్ని పరిశోధనల అనంతరం ఈ వైద్యం సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తే అన్యాయంగా ఈ వ్యాధి బారిన పడిన వారిని బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా జరిగే పరిశోధనలు విజయవంతం కావాలని ఆశిద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com