న్యూజిలాండ్‌ ప్రధాని సంచలన నిర్ణయం

న్యూజిలాండ్‌ ప్రధాని సంచలన నిర్ణయం

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. గత శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌ మసీదులో ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాది సృష్టించిన మారణహోమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లతో పాటు అసాల్ట్ రైఫిళ్ల అమ్మకాల్ని నిషేధిస్తూ కొద్దిసేపటి కిందట ( గురువారం 21.03.2019) ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉగ్రవాది బ్రెంటన్ టారంట్‌ వాడిన ఆయుధాల రకాలపై కూడా నిషేధం విధించారు.

తుపాకులపై నిషేధం
కొన్ని రకాల తుపాకులపై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు ప్రధాని జసిండా. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా జారీ చేశారు. ఏప్రిల్ 11 నాటికల్లా కఠినమైన తుపాకీ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. దానికంటే ముందుగా ఆయుధాల అమ్మకాలపై నిషేధం విధించినట్లు చెప్పుకొచ్చారు. 

ఉగ్రదాడిపై సీరియస్
క్రైస్ట్‌చర్చ్‌ లోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అది జరిగిన రెండు మూడు రోజుల్లోనే.. పార్లమెంటులో అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో సదరు ఉగ్రవాది పేరు ఉచ్ఛరించడానికి కూడా ప్రధాని అయిష్టత చూపారు. 

అప్రమత్తం.. తుపాకులు బ్యాన్
ఆ ఉగ్ర ఘాతుకాన్ని అంత ఈజీగా తీసుకోవద్దనే కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఎవరూ పడితే వాళ్లు ఇష్టారాజ్యంగా రైఫిళ్లు కొనుగోలు చేసే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడయింది.

టెర్రరిస్టుల కార్యకలాపాలకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని జసిండా. ఇకపై ఉగ్రవాదుల ఆటలు సాగకుండా.. తుపాకులపై నిషేధం తెరపైకి తెచ్చారు. సైన్యంలో వాడుతున్న అన్నిరకాల తుపాకులకు సంబంధించినవి మార్కెట్ లో అమ్మడానికి వీల్లేకుండా నిషేధించారు. సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లు, అసాల్ట్ రైఫిళ్లు, తుపాకులుగా మార్చే పరికరాలు.. ఇలా కొన్ని రకాల వాటిపై బ్యాన్ విధించారు.

Back to Top