వారి బయోపిక్‌లకు ఎలక్షన్‌ కోడ్‌ వర్తించదా?

- March 21, 2019 , by Maagulf
వారి బయోపిక్‌లకు ఎలక్షన్‌ కోడ్‌ వర్తించదా?

విపక్ష, ప్రతిపక్ష నాయకులు పోటాపోటీ బయోపిక్‌లతో వెండితెర రాజకీయం హీటెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన బయోపిక్‌ చిత్రం పీఎం నరేంద్ర మోదీ..ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కాబోతోంది. ఇక మోదీతో రాజకీయంగా తలపడుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై తీసిన బయోపిక్‌ మై నేమ్‌ ఈజ్‌ రాగా సినిమాను… ఏప్రిల్‌లోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అదే 5వ తేదీ రోజు టీవీల్లో మన్మోహన్‌ బయోపిక్‌ ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్ సినిమా ప్రసారం కానుంది. ఇక తెలుగులో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్‌ బయోపిక్ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికళ వేళ వస్తున్న బయోపిక్‌లపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయనేది వారి భావన.
 
ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే దివంగత ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి యాత్ర, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌పై తీసిన కథనాయుడు, మహానాయుడు సినిమాలు రిలీజయ్యాయి. ఆ సమయంలోనే బాల్‌థాకరే బయోపిక్‌ కూడా రిలీజ్‌ అయ్యింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్‌ లేకపోవడంతో వీటిపై ఎవరూ పెద్దగా అభ్యంతర పెట్టలేదు. కానీ ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా రాజకీయ బయోపిక్‌లను విడుదల చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఇటు రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మార్చి 29న తెలుగు రాష్ట్రాల్లో.. అటు పీఎం నరేంద్ర మోదీ, మై నేమ్‌ ఈజ్‌ రాగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదా? అన్న చర్చ ఇప్పుడు ప్రారంభమైయింది. ఎన్నికల కోడ్‌తో తమకు సంబంధం లేదన్న కారణంతో ఈ సినిమాల విడుదలకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్లు జారీ చేశాయి. వీటిని అడ్డుకోవాలా?వద్దా? అన్న విషయంలో ఎన్నికల కమిషన్‌ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. బయోపిక్‌లపై ఇప్పటికీ ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 126(1) సెక్షన్‌ కింద కచ్చితంగా బయోపిక్‌లకు ఆంక్షలు వర్తిస్తాయి. ఇందులోని నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నాటకాలు, కచేరీలు, ఇతర వినోద కార్యక్రమాల పేరిట కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేయరాదు. సినిమాలు, టీవీలు, రేడియోలు, సోషల్‌ మీడియా ద్వారా ఎలాంటి ప్రచారం చేయకూడదు. మోదీ, రాహుల్‌పై తీసిన బయోపిక్‌ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడమే కాకుండా… టీవీ, ఆన్‌లైన్, సోషల్‌ మీడియాల ద్వారా విస్తృతంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అలాంటప్పుడు 48 గంటల ఆంక్షలు ఈ సినిమాలకు తప్పకుండా వర్తిస్తాయి. బయోపిక్‌ బ్రేకులు వేయాలా లేదా అన్నది ఈసీ చేతుల్లోనే ఉంది. మరి ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com