చైనా కు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సన్నాహాలు
- April 04, 2019
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో హిందూ మహాసముద్రం ఒకటి. దీనిపై ఆధిపత్యం సాధించిన వారు ప్రపంచంపై ఆధిపత్యం సాధిస్తారు. చరిత్రను తిరగేస్తే ఈ విషయాన్ని బ్రిటన్ నావికాదళం నిరూపించిందని అర్థమవుతుంది. బలమైన నావికాదళాలతో బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక భాగాన్ని తమ సామంత రాజ్యాలుగా మార్చేసుకున్నాయి. ఆధునిక యుగంలో సంప్రదాయక ఆయుధాలతో చేపట్టే యుద్ధాల కంటే ఆర్థిక యుద్ధాలు అత్యంత ప్రభావితం చేసేవిగా ఉంటాయి. దేశాలను శిథిలావస్థకు చేర్చేస్తాయి. అందుకే దేశాలకు వాణిజ్య మార్గాలు జీవనాడులతో సమానం. ప్రపంచంలో అత్యంత కీలకమైన హిందూ మహా సముద్రంలో భారత్ పెద్ద దేశం. ఈ సముద్రంపై రవాణ భారత్ కనుసన్నల్లోనే జరగాలి. భారత్‌కు ప్రధాన ప్రత్యర్థి చైనా ఈ సముద్రంలోకి నేరుగా వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్థాన్‌లోని గ్వాదర్ మార్గంలో ప్రవేశించి హిందూ మహా సముద్రంపై పెత్తనం చేయాలని భావిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా నావికాదళాన్ని అడ్డుకోవడానికి అవసరమైన సబ్మెరైన్లను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత్ వద్ద న్యూక్లియర్, డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల మొత్తం 16 ఉన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అవసరాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ.
ప్రాజెక్టు 75ఐ
1999లో ప్రాజెక్టు 75 కింద మొత్తం 24 సబ్మెరైన్లను సిద్ధం చేయాలని నిర్ణయించింది. కానీ ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుండటంతో దీనిని రెండు భాగాలు చేసింది. రెండో భాగానికి 'ప్రాజెక్టు 75ఐ' అని పేరు పెట్టింది. దీని కింద రెండు ప్రొడక్షన్ లైన్లను సిద్ధం చేసి విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో ఒక్కో దానిలో ఆరు చొప్పున నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ సబ్మెరైన్లను భారత్ స్వయంగా నిర్వహించుకొనేట్లు ఉండేలా చూసుకోవాలన్నది లక్ష్యం. భారత్ ఏ పరిస్థితుల్లో అయినా కనీసం 20 సబ్మెరైన్లను కలిగి ఉండేలా చేయడమే లక్ష్యంగా దీనిని చేపట్టింది. సాంకేతికత బదిలీ, దేశీయ కంపెనీలతో ఒప్పందాలు వంటి కీలక అంశాలను ఇందులో చేర్చారు.
వ్యూహాత్మక ఎంపిక..
తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆరు సబ్మెరైన్ల తయారీకి సంబంధించి ప్రణాళికను ముందుకు జరిపింది. ఈ ప్రాజెక్టు విలువ రూ50 వేల కోట్ల పైమాటే. ఆసక్తి ఉన్న విదేశీ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈవోఐ నోటిఫికేషన్ జారీ చేసింది. కాకపోతే చైనాను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ల కంటే పెద్దవాటిని ఎంచుకోవాలని భారత్ నిర్ణయించింది. దాదాపు 50శాతం పెద్ద సబ్మెరైన్లను తీసుకోవాలని నిర్ణయించుకొంది.
భూ ఉపరితలంపై దాడి చేయగల క్రూయిజ్ క్షిపణలు, యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు ఉండాలని పేర్కొంది. దీంతో పాటు 18 భారీ టార్పిడోలను తీసుకెళ్లగలగాలి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ల కంటే ఇవి చాలా శక్తివంతమైనవి. వీటిల్లో నిట్టనిలువునా క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉండాలాని పేర్కొంది. ఇటీవలే రక్షణ పరికరాల కొనుగోళ్ల కౌన్సిల్ దీనికి క్లియరెన్స్ ఇచ్చింది.
మరో న్యూక్లియర్ సబ్‌మెరైన్ కూడా..
భారత్ 'అకుల' శ్రేణికి చెందిన మరో సబ్‌మెరైన్‌ను లీజుకు తీసుకోవడానికి ఒప్పందం చేసుకొంది. ఈ డీల్ విలువ రూ.21వేల కోట్లు. 2025నాటికి ఇది భారత నావికాదళంలో చేరుతుంది. ఇప్పటికే భారత్ వద్ద పూర్తి దేశీయ పరిజ్ఞానంతో చేసిన న్యూక్లియర్ సబ్‌మెరైన్ అరిహంత్, మరో న్యూక్లియర్ సబ్‌మెరైన్ అకుల -2 శ్రేణికి చెందిన చక్ర-2 ఉన్నాయి. కానీ చక్ర-2 లీజుగడువు 2022 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన మలక్కా జలసంధి వద్ద గస్తీ నిర్వహిస్తూ అవసరమైనప్పుడు చైనాకు అడ్డుకట్ట వేయాలంటే మాత్రం భారత్ ప్రాజెక్టు75ఐను వీలైనంత తర్వగా పట్టాలక్కెంచి పరుగులు పెట్టించాల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..