పారిస్‌లో అగ్నికి ఆహుతైన నోట్రే డామే చర్చి..భావోద్వేగానికి లోనైన ఫ్రాన్స్ అధ్యక్షుడు

- April 16, 2019 , by Maagulf
పారిస్‌లో అగ్నికి ఆహుతైన నోట్రే డామే చర్చి..భావోద్వేగానికి లోనైన ఫ్రాన్స్ అధ్యక్షుడు

పారిస్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నోట్రే డామే కేథడ్రల్ చర్చి అగ్నికి ఆహుతైంది. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఉన్న 12వ శతాబ్దపునాటి పురాతన ప్రార్థనా మందిరం మంటల ధాటికి పాక్షికంగా కుప్పకూలింది. చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కొద్ది నిమిషాల వ్యవధిలోనే చర్చిని చుట్టుముట్టాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

400 ఫైరింజన్లు
నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. దాదాపు 400 ఫైరింజన్ల సాయంతో అగ్నికీలలను అదుపులోకి చేసే ప్రయత్నం చేశారు. చర్చి చుట్టుపక్కల నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

12వ శతాబ్దపు నాటి కట్టడం
12వ శతాబ్దానికి చెందిన పురాతన కట్టడమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ప్యారిస్‌లో చారిత్రాత్మకమైన ప్రదేశమైన ఈ చర్చిని సందర్శించేందుకు ఏటా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకలు తరలివస్తుంటారు. నోట్రే డామే చర్చి అగ్నికి ఆహుతి కావడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేకరోన్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
 
నోట్రే డామే ఘటనపై స్పందించిన ట్రంప్
నోట్రే డామే కేథడ్రిల్ చర్చి అగ్నికి ఆహుతవడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని గొప్ప వారసత్వ సంపదల్లో ఒకటైన చర్చి మంటల్లో కాలిపోవడం బాధ కలిగించిందని అన్నారు. ప్రజల జీవన విధానం, సంస్కృతిలో భాగమైన నోట్రే డామే చర్చి ఆనవాళ్లు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానన్నారు ట్రంప్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com