టీటీడీ బంగారం తరలింపు వివాదంలో కొత్త మలుపు

టీటీడీ బంగారం తరలింపు వివాదంలో కొత్త మలుపు

టీటీడీకి చెందిన శ్రీవారి బంగారం తరలింపుపై వివాదం కొనసాగుతోంది. దీనిపై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించడంతో.. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. ఆయన తిరుమల చేరుకుని.. రికార్డులు పరిశీలించి, TTD అధికారులతో మాట్లాడి సమగ్ర రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. రేపటికల్లా ప్రాథమిక నివేదికను CSకు అందించనున్నారు. చెన్నై నుంచి 1381 కేజీల బంగారం తరలింపులో భద్రతాలోపాలకు ఎవరు బాధ్యులు..? ఈ బంగారాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ కింద డిపాజిట్ చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగానే TTD నిర్ణయలు తీసుకుందా..? ఈ డిపాజిట్‌ నిర్ణయానికి పాలక మండలి అనుమతి ఉందా..? బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన బంగారాన్ని తిరిగి TTD ట్రెజరీకి చేర్చే బాధ్యత ఎవరిది? లాంటి అంశాలపై అన్ని వివరాలపై స్పష్టత తీసుకున్నాక మన్మోహన్ సింగ్ రిపోర్ట్ ఇవ్వనున్నారు.

EO అనిల్ కుమార్ సింఘాల్ దీనిపై ఇవాళ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇవ్వనున్నారు. బంగారం తరలింపు విషయంలో పూర్తిస్థాయి వివరాలు భక్తులకు తెలియచేస్తానంటున్నారు. ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణల్ని ఖండించిన ఆయన.. శ్రీవారి బంగారం, నగదు తరలింపు అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందన్నారు. మరోవైపు, TTD బంగారం డిపాజిట్‌ విషయమై చర్చించేందుకు రెండు రోజుల్లో ధర్మకర్తల మండలి అత్యవసరంగా సమావేశం కానుంది.

ఈ నెల 17న చెన్నైలోని వెప్పంపట్టు సమీపంలో ఓ వాహనం తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా దొరికిన ఈ గోల్డ్‌ను.. పూందమల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. ఐతే.. ఇదంతా TTDదని, డిపాజిట్ గడువు ముగియడంతో తిరిగి వారికే అప్పగిస్తున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. TTD కూడా ఈ బంగారం అంతా తమదేనంటూ లేఖ ఇచ్చింది. ఐతే.. ఇంత విలువైన సంపదను తరలించేప్పుడు సరైన పత్రాలు లేకుండా, భద్రత లేకుడా తరలించడం చర్చనీయాంశమైంది.

మూడేళ్ల కిందట శ్రీవారికి చెందిన 8 వేల 500 కిలోల బంగారాన్ని ఆంధ్రాబ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మూడేళ్ల క్రితం 1311 కిలోల బంగారాన్ని డిపాజిట్‌ చేశారు. దీనికి 1.75 శాతం వడ్డీ వచ్చింది. దీంతో.. మరో 70 కిలోల బంగారం అసలుకి జతైంది. ఈ మొత్తం 1381 కేజీలను TTD ట్రెజరీకి తీసుకొస్తున్న సమయంలోనే.. పోలీసులకు దొరకడంతో కలకలం రేగింది.

బంగారం డిపాజిట్‌ విషయంలో దేవస్థానం అధికారులు స్వతంత్రంగా ఎలా నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా చర్చనీయాంశమైంది. పాలక మండలి అనుమతి తీసుకున్నారా లేదా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి స్వామిజీ…. TTD తీరును తప్పుపడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. తర్వాత ఆ వీడియోను తొలగించిన ఆయన తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వ్యక్తం చేశారు. తొందరపాటులో తాను ఆ పనిచేశానని.. పీఠాధిపతిగా తన నుంచి ఎవరూ ఆ భాషను ఆశించరని అన్నారు. ఈవో సింఘాల్‌ నిజాయితీగా, అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Back to Top