హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌లో ‘నాని’!!

హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌లో ‘నాని’!!


స్టేడియంలో రియల్ హీరోస్, థియేటర్‌లో రీల్ హీరో ప్రేక్షకులు రెప్పవాల్చకుండా ఆధ్యంతం ఆసక్తిగా తిలకించేలా చేశారు. నానీ క్రికెటర్‌గా సిక్స్‌లు కొడుతుంటే మన హైదరాబాద్ సన్‌రైజర్స్‌కే ఆడుతున్నాడన్న అనుభూతికి లోనయ్యాడు ప్రతి ప్రేక్షకుడు. నానీ ప్రాణం పెట్టి నటించాడు.. అర్జున్ పాత్రకి ప్రాణం పోశాడు. అందుకే ఇండస్ట్రీ మొత్తం నానీ నటనకు ఫిదా అయ్యింది. తోటి నటుడిని పొగిడితే నాటకీయంగా అనిపించొచ్చు అని తెలిసి కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు టాలీవుడ్ హీరోస్. అంతబాగా నానీ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.  సినిమాలో నానీ నటనను వర్ణించడానికి మాటలుండవ్.. మాట్లాడుకోటాలుండవ్.. ప్రేక్షకుడు ఎలాంటి చిత్రాలు కోరుకుంటున్నారో మరోసారి రుజువు చేశాడు దర్శకుడు.

కథ మీద పట్టు.. ఆ కథకు ప్రాణం పెట్టి నటించే నటుడు దొరికితే ప్రేక్షకులు ఆదరిస్తారనేదానికి చక్కని ఉదాహరణ జెర్సీ. భారీ తారాగణం, అదిరిపోయే సెట్టింగులు, అందాల ఆరబోతలు, నాలుగు ఫైట్లు, ప్రేక్షకులను నవ్వించడానికి నానా అగచాట్లు పడే వల్గర్ కామెడీ లాంటివి ఏమీ పెట్టకుండా వాస్తవానికి దగ్గరగా దర్శకుడు కథను మలిచిన తీరు అద్భుతంగా ఉంది. అందుకే అందరికీ నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రమని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా చేసింది.

నానీ నటనను మెచ్చుకుంటూ, దర్శకుడి ప్రతిభను ఉటంకిస్తూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్ లాంటి సెలబ్రిటీలు నానీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ స్పెషల్‌గా గ్రీట్ చేశాడు నానీని. ‘అర్జున్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశాడు’ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘నానీ సూపర్‌గా నటించాడు’.. ‘సినిమాలో లీనం అయ్యేలా చేశాడు’. ‘దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు’ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. చివరిగా ఓ గమనిక అంటూ విజయ్.. ‘నానీ హైదరాబాద్ సన్ రైజర్స్‌కి ఆడొచ్చు..స్ట్రైకింగ్ అదరగొట్టేశాడు’ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Back to Top