'యతి' పాదముద్రలంటూ ట్వీట్ చేసిన ఇండియన్ ఆర్మీ..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్

- April 30, 2019 , by Maagulf
'యతి' పాదముద్రలంటూ ట్వీట్ చేసిన ఇండియన్ ఆర్మీ..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్

 

 

హిమాలయాల్లో యతి సంచారంపై పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనిషి, కోతి కలగలిసినట్లుండే భీకర ఆకారంతో యతి ఉంటుందని హిమాలయాల్లో నివసించే షెర్పాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు మంచుపై పెద్ద పెద్ద పాద ముద్రలు కనిపించడం యతి విషయంలో వారు చెబుతున్న మాటలకు బలం చేకూర్చుతోంది. హిమాలయాల్లో సంచరించే భారీకాయం గల మంచు మనిషి అసలు ఉన్నాడా లేదా అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చన్. అయితే యతి పాదముద్రలంటూ ఇండియన్ ఆర్మీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి.

యతి పాదముద్రలు కనుగొన్న సైన్యం
హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్లి భారత సైనికులకు మంచు మనిషి యతి పాదముద్రలు కనిపించాయట. ఏప్రిల్ 9వ తేదీన ఓ ఆర్మీ టీం హిమాలయ పర్వాతాల్లోని మకలు బేస్ క్యాంప్‌కు వెళ్లింది. మకలు బరూన్ నేషనల్ పార్కులోని మంచుకొండల్లో యతి (మంచుమనిషి) పాదముద్రలను ఆ బృంద సభ్యులు కనుగొన్నారు. ఆ పాదముద్రల్ని ఫొటోలు తీసిన పర్వతారోహకులు వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్
ఇండియా ఆర్మీ కనుగొన్న మంచు మనిషి పాద ముద్ర 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మంచు కొండల్లో యతి సంచారంపై ఆర్మీ అధికారులు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఆర్మీ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు సైన్యంపై ప్రశంసల జల్లు కురిపించగా.. మరికొందరు ట్రోల్ చేశారు.

యతి మనుగడపై మళ్లీ చర్చ
భారత సైన్యం చేసిన ట్వీట్‌తో హిమాలయాల్లో యతి మనుగడపై మళ్లీ చర్చ మొదలైంది. అసలు అలాంటి జీవి ఉందా? ఉంటే అది మనిషా? జంతువా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి యతి మనుగడపై శాస్త్రజ్ఞులు, పరిశోధకులు చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. యతి కాల్పనిక జీవి కాదని, అది నిజంగానే ఉందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ ప్రొఫెసర్ బ్రయాన్ సైక్స్ గతంలోనే ప్రకటించారు. యతి వెంట్రుకలుగా ప్రచారంలో ఉన్న కేశాలపై ప్రయోగాలు చేసి యతి డీఎన్ఏ లక్షా ఇరవై వేల ఏళ్ల నాటి పురాతన ధ్రువపు ఎలుగుబంటి డీఎన్ఏతో సరిపోలుతోందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com