IPLలో చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..

- April 29, 2024 , by Maagulf
IPLలో చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..

ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక మ్యాచుల విజ‌యాల్లో భాగ‌మైన తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఆదివారం చెపాక్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌ ద్వారా మ‌హేంద్రుడు ఈ ఘ‌నత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు 78 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ధోని ఐపీఎల్ కెరీర్‌లో 150వ విజ‌యం కావ‌డం విశేషం. ధోని ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో 259 మ్యాచులు ఆడాడు.


ఇక ఈ జాబితాలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్ద‌రు చెరో 133 విజ‌యాల్లో భాగ‌స్వామ్యం అయ్యారు. ఆ త‌రువాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫినిష‌ర్ దినేశ్ కార్తీక్ (125), చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు సురేశ్ రైనా (122) లు ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ఎంఎస్ ధోని – 150 మ్యాచులు
ర‌వీంద్ర జ‌డేజా – 133
రోహిత్ శ‌ర్మ – 133
దినేశ్ కార్తిక్ – 125
సురేశ్ రైనా – 122
అంబ‌టి రాయుడు – 121
విరాట్ కోహ్లి – 116

ఇక ఆదివారం జ‌రిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. సీఎస్‌కే మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 212 ప‌రుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98), డారిల్ మిచెల్ (32 బంతుల్లో 52) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ 18.5 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com