జగన్‌కు కేసీఆర్‌ అపూర్వ స్వాగతం

జగన్‌కు కేసీఆర్‌ అపూర్వ స్వాగతం

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ప్రగతిభవన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. గవర్నర్‌తో భేటీ తర్వాత తొలిసారిగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఆయన సతీమణి భారతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాదర స్వాగతం పలికారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, కేశవరావు, మంత్రులు, సభాపతి, ఉపసభాపతి తదితరులు జగన్‌కు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఏపీలో  151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన వైకాపా అధినేతకు పుష్పగుచ్ఛం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.


ఈ నెల 30న తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాలని ఆహ్వానించిన జగన్‌కు మిఠాయి తినిపించి శాలువాతో సత్కరించారు. అనంతరం జగన్‌కు జ్హాపికను అందజేశారు. కష్టానికి తగిన ఫలితం జగన్‌కు దక్కిందంటూ పలువురు మంత్రులు అభినందించారు. జగన్‌ వెంట వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు. జగన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని, కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కలిసి పనిచేయాలనే దానిపై ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Back to Top