భారత్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

- May 25, 2019 , by Maagulf
భారత్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌మ్యాచ్‌లో టీమిండియా నిరాశకు గురిచేసింది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేయడంతో న్యూజిలాండ్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేన్‌ విలియమ్సన్‌ (67; 87 బంతుల్లో 6x4, 1x6), రాస్‌టేలర్‌ (70; 73 బంతుల్లో 8x4) బాధ్యతాయుతంగా ఆడి అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించి జట్టుని విజయబాటలో నడిపించారు. అనంతరం విలియమ్సన్‌ ఔటైనా అప్పటికే ఆ జట్టు విజయం ఖాయమైంది. ఆఖర్లో టేలర్‌, హెన్రీ నికోల్స్‌ (15; 28 బంతుల్లో 1x4) నిలకడగా ఆడి లక్ష్యాన్ని పూర్తిచేశారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమవడంతో మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రవీంద్ర జడేజా (54; 50 బంతుల్లో 6x4, 2x6), హార్దిక్‌ పాండ్య (30; 37 బంతుల్లో 6x4) ఆదుకున్నారు. కోహ్లీ(18), ధోనీ(17), కుల్‌దీప్‌యాదవ్‌(19) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. దీంతో 39.2 ఓవర్లలో భారత్‌ 179 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌ నాలుగు వికెట్లు తీయగా జేమ్స్‌ నీషమ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌సౌథీ, గ్రాండ్‌హోమ్‌, ఫెర్గుసన్‌ తలో వికెట్‌ తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com