ప్రత్యేకహోదా మాత్రమే ఏపీకి జీవధార:జగన్

- June 15, 2019 , by Maagulf
ప్రత్యేకహోదా మాత్రమే ఏపీకి జీవధార:జగన్

న్యూ ఢిల్లీ:నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన క్రమంలోనే కొత్త రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు. 59శాతం జనాభా ఉన్నఆంధ్రప్రదేశ్‌కు 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారని వివరించారు. అత్యంత ఆదాయం ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. హైదరాబాద్‌లోనే ఐటీ సెక్టార్‌ ఉండటంతో ఏపీ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందని చెప్పారు. తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువ ఉండటంతో ఆ నష్టాన్ని పూడ్చడానికి అప్పటి కేంద్రం ఏపీకికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అప్పటి అధికార, విపక్ష పార్టీలేవీ హామీ నిలబెట్టుకోలేదన్నారు. దీంతో మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్యరంగాలు పతనావస్థకు చేరాయని చెప్పారు జగన్.

విభజన సమయంలో 97 వేల కోట్లుగా ఉన్న ఏపీ అప్పులు..ఇవాళ్టికి రెండున్నర లక్షల కోట్లకు చేరిందని జగన్ చెప్పారు. ప్రత్యేకహోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంత మేర పూడ్చగలదని..ఆ దిశగా కేంద్రం ఆలోచన చేయాలని గుర్తు చేశారు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకహోదా ప్రస్తావన ఉందని సిఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని అభ్యర్ధించారు జగన్. ప్రత్యేకహోదా మాత్రమే ఏపీకి జీవధారగా మిగిలిందన్నారు. ప్రత్యేకహోదాపై అనేక అపోహలు కూడా ప్రచారంలో కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదాకు ఎలాంటి వ్యతిరేకంగా సిపార్సులు చేయలేదని ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి ఆయోగ్ ముందు ఉంచారు జగన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com