ఇరాన్ ఏం చేస్తోందో చూస్తున్నాం..కాచుకొని ఉన్నాం: ట్రంప్

- June 19, 2019 , by Maagulf
ఇరాన్ ఏం చేస్తోందో చూస్తున్నాం..కాచుకొని ఉన్నాం: ట్రంప్

వాషింగ్టన్‌: ఇరాన్‌ చర్యలను తాము ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ సమీపంలో గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో చమురు ట్యాంకర్లపై దాడి జరగిన నాటి నుంచి అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ట్రంప్‌ స్పందించారు. ''మేము ఇరాన్‌ కోసం కాచుకొని ఉన్నాము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. వారేం చేస్తున్నారో చూస్తున్నాం. కేవలం గత వారం చేసిన విషయాలు కాదు.. చాలా కాలం నుంచి ఇరాన్‌ను గమనిస్తున్నాం. అది ఉగ్రవాద దేశంగా కొనసాగుతోంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు. టైమ్‌ పత్రికతో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ మాటలు అన్నారు. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయకుండా సైనిక చర్య చేపట్టడానికి కూడా సిద్ధమేనని అన్నారు. 

మధ్యప్రాఛ్యంలో మరో 1000 మంది సైనికులను తరలిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన మర్నాడే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో చమురు ట్యాంకర్లపై ఇరానే దాడి చేసిందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. గత వారం నుంచి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సోమవారం ఇరాన్‌ మరో కీలక ప్రకటన చేసింది. 2015 ఒప్పందం ప్రకారం పేర్కొన్న యూరేనియం నిల్వల పరిధిని త్వరలో దాటేస్తామని తెలిపింది. గత ఏడాది అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com