బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం చెల్లదు--టీడీపీ

- June 21, 2019 , by Maagulf
బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం చెల్లదు--టీడీపీ

న్యూ ఢిల్లీ:బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విలీనం చెల్లదని.. ఇది ఖచ్చితంగా ఫిరాయింపుల కిందకే వస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ.. న్యాయం పోరాటం చేయాలని నిర్ణయించింది. న్యాయ సలహా ప్రకారం ముందుకు వెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభా విలీనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ ఎంపీలు.. ఇవాళ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడునికి కలిసి ఫిర్యాదు చేయనున్నారు. విలీనాన్ని రద్దు చేయాలని కోరనున్నారు.

పార్లమెంటరీ పార్టీ లెటర్‌హెడ్‌తో రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అందించారని.. చట్టపరంగా ఈ విలీనం చెల్లదని టీడీపీ చెబుతోంది. పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ సమావేశం ఏర్పాటు చేయనప్పుడు… ఆ నలుగురు ఇచ్చిన లేఖకు టీడీపీతో సంబంధం లేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. లేఖలో నలుగురు ఎంపీలు ప్రస్తావించిన 10వ షెడ్యూల్‌ దీనికి వర్తించదంటున్నారు. ఇవే అంశాలపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు తెలుగు దేశం నేతలు.

ఇటీవలే పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు మారితే మారొచ్చు కానీ… పదవికి రాజీనామా చేసి మారాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఫిరాయింపు పిటిషన్లపై కోర్టులు కూడా వెంటనే తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఎంపీలు… ఏకంగా బీజేపీలో టీడీపీపీని విలీన తీర్మానాన లేఖను ఉపరాష్ట్రపతికి అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సభ్యత్వాలకు రాజీనామా చేయకుండా వేరే పార్టీల్లో చేరడం సబబు కాదని పలు సందర్భాల్లో అన్న వెంకయ్యనాయుడు.. ఇప్పుడు టీడీపీపీ విలీనం విషయంలో ఎలా వ్యవహరిస్తారు. విలీన తీర్మానాన్ని ఆమోదిస్తారా? లేదా రద్దు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావులు ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. నిన్న పార్టీలో చేరిన అనంతరం నలుగురు అమిత్‌ షా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com