జీ-20లో వాణి వినిపించనున్న మోడీ

- June 27, 2019 , by Maagulf
జీ-20లో వాణి వినిపించనున్న మోడీ

ఒసాకా: జపాన్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ (జీ-20) సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమావేశంలో జీ-20 దేశాల ప్రస్తుత పరిస్ధితులపై చర్చిస్తాయి. ఇందులో ప్రధాని మోడీ సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితర సభ్య నేతలు పాల్గొంటారు.

మూడురోజుల పర్యటన 
జీ-20 సమావేశాల్లో భాగంగా ఒసాకాలో ప్రధాని మోడీ మూడురోజులు ఉంటారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోడీ చర్చలు జరుపుతారని పేర్కొన్నది. ఒసాకా చేరుకున్న మోడీకి విమానాశ్రయంలో భారతదేశానికి చెందిన స్విసోటెల్ నాన్‌కై ఘన స్వాగతం పలికారు. మోడీని చూస్తూ నినాదాలు చేశారు. భారత ప్రధానిగా ఆరో జీ-20 సమావేశానికి మోడీ హాజరయ్యారు.

మోడీ- ట్రంప్ భేటీ
జీ-20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సమావేశమవుతారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కోసం అధినేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. తొలుత జపాన్ ప్రధాని షింబో అబేతో ట్రంప్ భేటీ అవుతారు. తర్వాత 9.15 గంటలకు సమావేశానికి మోడీ హాజరవుతారు. ముగ్గురు కలిసి వివిధ అంశాలపై డిస్కస్ చేస్తారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు వాణిజ్యం, ఆర్థికపరమైన అంశాలపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. జీ-20 సమావేశంలో మహిళా సాధికారత, ఉగ్రవాద నిరోధం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించాలని మోడీ లేవనెత్తే అవకాశం ఉంది. వివిధ కీలక అంశాలకు ఒసాకాలో జరిగే జీ సమ్మిట్ పరిష్కారం లభిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఒసాకాలో లేవనెత్తిన కీలక అంశాలకు 2022లో భారత్‌లో నిర్వహించే సమ్మిట్ మంచి వేదిక అవుతుందన్నారు. కీలక సమస్యలకు చెక్ పెట్టడంతోపాటు .. మరింత పురోభివృద్ధి కోసం పాటుపడొచ్చని పేర్కొన్నారు. 2022లో భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. 

కీ డిస్కషన్స్
నిన్న భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జై శంకర్, మైక్ పొంపియో మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ 400 క్షిపణుల గురించి డిస్కస్ జరిగింది. దీనిపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పొంపియో. అయితే తమకు జాతి ప్రయోజనాలే ముఖ్యమని జై శంకర్ తేల్చిచెప్పారు. మేం ఇతర దేశాలతో పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు. ఇండియా తమ ముఖ్య భాగస్వామ్యమని ఈ సందర్భంగా పొంపియో తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. రష్యాతో క్షిపణి ఒప్పందంపై పొంపియో ప్రధానంగా లేవనెత్తగా .. తాము రష్యాతోపాటు ఇతర దేశాలతో కూడా రక్షణపరంగా సాయం తీసుకుంటామని జై శంకర్ తెలిపారు. ఇప్పటికే చాలా దేశాల సహకారం కూడా తీసుకున్నామని గుర్తుచేశారు. ఇది తమ జాతి ప్రయోజనాల కోసం చేస్తున్న పనులని తెలిపారు. ఆయా దేశాలతో పనిచేయాలనేది తమ వ్యుహాత్మక విధానమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com