సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌: ఓ విజేత ఆత్మ కథ!

- July 14, 2019 , by Maagulf
సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌: ఓ విజేత ఆత్మ కథ!

 

 

జీవితంలో ఒక్కో వ్యక్తికీ విజయం ఒక్కోలా వరిస్తుంది. విజయం సాధించే క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కో మార్గంలో ప్రయాణించవచ్చుగాక. కానీ, గెలుపు దిశగా వేసే ప్రతి అడుగులోనూ కష్టం ఒకటేనంటారు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం. ఓ సాధారణ పల్లెటూరి యువకుడు, ఐఏఎస్‌ అధికారిగా ఎదగడం, ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవడం మామూలే. అయితే, తన జీవితం పది మందికి మార్గదర్శకంగా వుండాలన్న ఉద్దేశ్యంతో బుర్రా వెంకటేశం, తన ఆత్మ కథని పుస్తకంగా మలచారు. కొత్త తరానికి సక్సెస్‌ 'మంత్ర' అంటే ఏంటో చెప్పే క్రమంలో 'సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌' అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు ఈ ఐఏఎస్‌ అధికారి. చిత్తశుద్ధితో లక్ష్యాన్ని నిర్దేశించుకోగలిగితే, ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వెనుకడుగు వేయకుండా వుండగలిగితే అదే గెలుపుకు బాట వేస్తుందని తన పుస్తకంలో పేర్కొన్నారు బుర్రా వెంకటేశం. సక్సెస్‌ని మూడు వంద అరవై డిగ్రీలలో చూపించడమే కాదు, ఆ సక్సెస్‌ని సాధించే క్రమంలో తాను పడ్డ తపన, పడ్డ కష్టం.. వీటన్నిటినీ సవివరంగా పేర్కొన్నారాయన. నేటి యువతరానికి ఈ పుస్తకం ఓ నిఘంటువులా మారుతుందంటే అది అతిశయోక్తి కాకపోవచ్చేమో. మహనీయుల గురించి ప్రస్తావిస్తూ, నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకంలో ప్రతి రాతా కనిపిస్తుంది. 'విజయం ఒక్కొక్కరికీ ఒక్కోలా వుండొచ్చుగానీ, ఆ విజయంలో కీలక పాత్ర పోషించే చిత్తశుద్ధి ఒకటే' అని చెబుతారు బుర్రా వెంకటేశం. సక్సెస్‌కి ఒకటే దారి వుంటుంది. అదే కష్టపడి పనిచేయడం, జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారు.? అలా అయ్యేందుకు ఏం చేయాలనుకుంటున్నారు.? అనుకున్నది సాధించాక ఏం చేయాలి.? అనే ముఖ్యమైన విషయాల చుట్టూనే మనిషి విజయం సాధారపడి వుంటుందని ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌లో ప్రస్తావించిన మాటలు నూటికి నూరుపాళ్ళూ నిజం. ఇది నేటి తరానికి ఎంతో అవసరం. ఈ ఫాస్ట్‌ యుగంలో నిర్ణయాలు అత్యంత వేగంగా తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయాలు ఖచ్చితత్వంతోపాటు, చిత్తశుద్ధిని కలిగి వుండాలని బుర్రా వెంకటేశం చెబుతున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com