ఏపీని ముంచెత్తుతున్న వరదలు..

- August 08, 2019 , by Maagulf
ఏపీని ముంచెత్తుతున్న వరదలు..

ఏపీని వరదలు వదలడం లేదు.. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ఏపీలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజులు పాటు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని జిల్లాల్లో అధికారులు అలర్ట్‌ అయ్యారు.. ఒడిశాలోని బాలాసోర్‌ దగ్గర వాయుగుండం ఇప్పటికే తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండ బలహీనపడుతోంది. దీంతో ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది.

వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని నదులకు వరద పోటెత్తింది. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగాయి. కరకట్టలు బలహీనంగా ఉన్న చోట ప్రవాహ తీవ్రతకు ఊళ్లలోకి నీరు ప్రవేశించింది. వంశధారపై గొట్టా బ్యారేజీ వద్ద బుధవారం అర్ధరాత్రి లక్షా 4 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. అన్ని గేట్లను ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. నది వెంట ఉన్న తొమ్మిది మండలాల్లోని అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తోటపల్లి ప్రాజెక్టుకు 23,800 క్యూసెక్కుల నీరు రావడంతో 17,101 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జియ్యమ్మవలస మండలంలోని బాసంగి బీసీ కాలనీలోకి నీరు భారీగా చేరింది. నాగావళి ఉద్ధృతి కారణంగా గరుగుబిల్లి మండలం నాగూరు, ఉల్లిభద్ర, కొమరాడ పాతకళ్లికోట గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. దీంతో ముంపుగ్రామాల్లో ప్రజలు భయం గుప్పెట్లోనే గడుపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. చింతూరులో 210.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జలదిగ్బంధంలో ఉన్న దేవీపట్నం మండలం పరిధిలోని పలు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సీలేరు నది, అలిమేరు, తడిక, పెద్ద వాగు, సోకులేరు, మడేరు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. వట్టిగడ్డ జలాశయంలో నీటిమట్టం 13 అడుగులకు చేరింది. కేవీకే, డొంకరాయి జలాశయాల్లోకి వరద పెరుగుతోంది. సూరంపాలెం, భూపతిపాలెం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి 10,91,696 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇవాళ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది చట్టి, చిడుమూరు వద్ద 30వ నంబరు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి చింతూరు వైపు రాకపోకలు నిలిచాయి. 326వ జాతీయ రహదారిపైకి నిమ్మలగూడెం వద్ద వరద చేరుకోవడంతో ఏపీ నుంచి ఒడిశా వైపు రాకపోకలు ఆగిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com