ఉపరాష్ట్రపతి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

- August 11, 2019 , by Maagulf
ఉపరాష్ట్రపతి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

చెన్నై:ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆవిష్కరించారు. చెన్నైలోని కలైవనర్‌ ఆరంగం వేదికగా ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉన్నానని.. ప్రజాసేవకు కాదన్నారు. ఏ హోదాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగానే ఉంటానన్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకోవడంలో భాగంగా.. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించానని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 600 జిల్లాల్లో తిరిగానన్నారు. ఎక్కడికి వెళ్లినా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటానన్నారు. ఎంత ఎదిగినా.. నేర్చుకోవడం ఆపొద్దని సూచించారు.  పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఎప్పుడూ ఉప రాష్ట్రపతి కావాలనుకోలేదని తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎంపిక సమయంలో అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి తనతో అమిత్‌ షా, ప్రధాని మోదీ చర్చించారన్నారు. అందులో భాగంగా.. ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉంటే బాగుంటుందని, అలాగే రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఉండాలి లాంటి పలు సూచనలు చేశానన్నారు. ఆ క్రమంలో కొంత మంది పేర్లను కూడా చర్చించామన్నారు. కానీ, చివరకు ఆ రోజు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో అనూహ్యంగా తననే ఎంపిక చేశారని తెలిపారు. పార్టీలో ప్రతిఒక్కరూ అందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని మోదీ తనకు తెలియజేశారన్నారు.  తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని.. పార్టీ ప్రోత్సహించి తనకు ఎన్నో పదవులను కట్టబెట్టిందన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి వెళుతున్న సమయంలో పార్టీ, సంస్థని వీడుతున్నానన్న బాధ ఉండేదన్నారు. కానీ, పదవులు వీడుతున్నందుకు ఏనాడు చింతించలేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయాల నుంచి విరమించుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నానాజీ దేశ్‌ముఖ్‌ లాంటి మహానాయకుల తరహాలో దేశాన్ని పటిష్ఠం చేసే నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నానన్నారు. అదే విషయాన్ని మోదీకి సైతం తెలిపానన్నారు. ఈ సందర్భంగా సుష్మ స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీతో తనకు ఉన్న కొన్ని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌, తమిళనాడు ముఖ్యమంత్రి పళనీ స్వామి, శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com