రష్యాకు బిలియన్ డాలర్లు ప్రకటించిన మోడీ

- September 08, 2019 , by Maagulf
రష్యాకు బిలియన్ డాలర్లు ప్రకటించిన మోడీ

మాస్కో: తూర్పు దేశాల అభివృద్ధి కోసం రష్యాకు ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (రూ. 7,182 కోట్లు) రుణసాయం అందజేయనున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 'యాక్ట్‌ ఈస్ట్‌' పాలసీకి భారత్‌ కట్టుబడి ఉందన్నారు. రష్యాలోని వ్లాదివోస్టాక్‌లో జరిగిన 5వ తూర్పు దేశాల ఆర్ధిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రష్యా, భారత్‌ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని అన్నారు.

ఇరుదేశాల మైత్రి కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాలేదన్నారు. ఇరు దేశాల ప్రజలు, వాణిజ్య సంబంధాలతో ముడిపడి ఉందని మోడీ తెలిపారు. తూర్పు దేశాల ఆర్థిక సదస్సు కార్యకలాపాల్లో భారత్‌ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని అన్నారు. రష్యా చమురు, గ్యాస్‌ పరిశ్రమల్లో భారతీయ సంస్థలు ఏడు బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (రూ. 50,274 కోట్లు) )మేర పెట్టబడులు పెట్టా యని అన్నారు. తూర్పు దేశాల ఆర్ధిక సదస్సుకు తనను ఆహ్వానించినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సు సందర్భంగా జరిగిన మేథోమథనం కేవలం తూర్పు ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాళి సంక్షేమానికి ఊతమిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్లాదివోస్టాక్‌లో తొలి దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది భారతదేశమేననే విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర దేశీయులపై ఆంక్షలు న్నప్పటికీ కూడా భారతీయుల కోసం వ్లాదివోస్టాక్‌ తలుపులు తెరిచే ఉంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. 2024 నాటికి భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని అన్నారు. 'ప్రవాస భారతీయుల శ్రమ, నైపుణ్యం తమ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆ ప్రాంత నాయకులు నన్ను కలిసినపుడు చెబుతారు. భారతీయ సంస్థలు ప్రపంచంలో చాలా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భారతీయుల పెట్టుబడులు, ప్రతిభ, వృత్తి నైపుణ్యం తూర్పు దేశాల వికాసానికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను. తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో భారత్‌ కీలక భాగస్వామిగా ఉంది. ఈ బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాంత నాయకులందరినీ భారత్‌ రావాలని కోరుతున్నాను' అని మోడీ అన్నారు.

ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారంపై మోడీ, అబే చర్చలు
రష్యా పర్యటనలో భాగంగా జపాన్‌, మలేషియా, మంగోలియా దేశాధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. తూర్పు దేశాల 5వ ఆర్థిక సదస్సు కోసం వ్లాదివోస్టాక్‌ వెళ్లిన ప్రధాని జపాన్‌, మలేషియా, మంగోలియా దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారంపై విడివిడిగా చర్చలు జరిపారు. జపాన్‌ ప్రధాని షింజో అబేతో భేటీ అయి ఆర్థిక, రక్షణ వంటి కీలక రంగాలతో పాటు అంకుర పరిశ్రమలు, 5జీ నెట్‌వర్క్‌, ప్రాంతీయ పరిస్థితులపై సమాచార మార్పిడి వంటి అంశాల్లో సహకారంపై చర్చించారు. మలేషియా ప్రధాని మహతీర్‌ బిన్‌ మహ్మద్‌, మంగోలియా అధ్యక్షుడు ఖల్టమాగిన్‌ బటుల్గాతో సమావేశమయ్యారు. మోడీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురితో చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com