2024 లో చంద్రయాన్-3 : ఇస్రో

- September 09, 2019 , by Maagulf
2024 లో చంద్రయాన్-3 : ఇస్రో

చంద్రయాన్ -2 మిషన్ సాంకేతిక సమస్యలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయినప్పటికీ వెనుకంజ వేయరాదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. చంద్రయాన్-2 విషయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాసటగా నిలుస్తానని భరోసా ఇవ్వడంతో చంద్రయాన్-3 ప్రాజెక్టును ఏమాత్రం జాప్యం చేయకుండా వేగిరంగా చేపట్టాలని నిర్ణయించారు.

ముఖ్యంగా, చంద్రయాన్-2 కంటే మరింత ఉన్నతమైన రీతిలో జపాన్‌ దేశ సహకారంతో దీనికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ఇస్రో చైర్మన్‌ డా.కె.శివన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఒకవేళ ఉభయదేశాల మధ్య ఒప్పందం కుదిరితే.. 2024లో సంయుక్తంగానే చంద్రుడిపైకి సరికొత్త ఉపగ్రహాన్ని పంపే అవకాశం ఉంది.

మరోవైపు, చందమామపై ల్యాండర్‌ విక్రమ్‌ ఉన్న చోటును గుర్తించినట్టు ఇస్రో ఆదివారం ప్రకటించింది. అది హార్డ్‌ ల్యాండింగ్‌ (అంటే.. నిర్దేశిత ప్రాంతంలో మృదువుగా కాక, నిర్ణీత వేగం కన్నా ఎక్కువ వేగంతో కిందికి జారిపోవడం) అయి ఉంటుందని ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ అభిప్రాయపడ్డారు. చంద్రయాన్‌-2లోని మరో కీలక మాడ్యూల్‌ అయిన ఆర్బిటర్‌.. విక్రమ్‌ ల్యాండర్‌ తాలూకూ థర్మల్‌ చిత్రాన్ని తీసిందన్నారు.

హార్డ్‌ ల్యాండింగ్‌ వల్ల విక్రమ్‌ మాడ్యూల్‌ దెబ్బతిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని.. విక్రమ్‌తో సంబంధాలను ఏర్పరచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే.. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఒకవేళ హార్డ్‌ల్యాండింగ్‌ అయినా.. విక్రమ్‌ సజావుగా నాలుగు కాళ్లపై నిలిచినట్టుగా పడి ఉంటే సౌరఫలకాల సాయంతో విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశం ఉందని, కానీ అవకాశాలు చాలా తక్కువని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇస్రో అధికారి ఒకరు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com