మసూద్ విడుదల..ఉగ్రవాదుల టార్గెట్ సౌత్ ఇండియా.?

- September 10, 2019 , by Maagulf
మసూద్ విడుదల..ఉగ్రవాదుల టార్గెట్ సౌత్ ఇండియా.?

కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మన దేశాన్ని కవ్విస్తూనే ఉంది. పాక్ ప్రధాని సహా, రాజకీయ నాయకులు ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. కశ్మీర్‌ను తమకు కాకుండా చేస్తున్నామనే ఉద్దేశంతో ప్రతీకార చర్యలకు దిగాలని భావిస్తున్నారు. ఇండియాలో ఉగ్రదాడులకు పురికొల్పేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఒక రహస్య ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్‌బుల్ ముజాహిదీన్, ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ సహా మరి కొన్ని సంస్థలు ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కనుగొన్నాయి.

భారత్‌లోని స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసి ఉగ్రదాడులకు పాల్పడాలని ఐఎస్ఐ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో దాడులు జరిగిన ప్రాంతాలు కాకుండా కొత్త ప్రాంతాల్లో దాడులకు పాల్పడి ఇండియాకు హెచ్చరిక పంపాలని కోరిందట. దక్షిణ భారత దేశాన్ని టార్గెట్ చేయమని ఐఎస్ఐ ఉగ్రసంస్థలకు సూచించినట్లు సమాచారం.

రెండు వారాల క్రితం కొంత మంది ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు కనుగొన్నాయి. ఇప్పటికే దీనిపై కూలంకషంగా దర్యాప్తు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎస్ఐ నేతృత్వంలో జరిగిన సమావేశం కీలకంగా మారింది. దీంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్.. భద్రతను మరింత కట్టుదిట్టం చేసే పనిలో పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com