సైబీరియాలో బుడగలు కక్కుతున్న సముద్రం

- October 10, 2019 , by Maagulf
సైబీరియాలో బుడగలు కక్కుతున్న సముద్రం

తూర్పు సైబీరియా సముద్రం వేడితో ఉడుకుతోందని, సముద్రం ఉపరితలంపై బుడగలు వస్తున్నాయని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ సహకారంతో ఆ సముద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు 80 శాస్త్రవేత్తల బృందం అక్కడికి వెళ్లింది. సముద్రం అట్టడుగు నుంచి విడుదలవుతున్న మితిమీరిన మిథేన్‌ గ్యాస్‌ సముద్రం ఉపరితలంపై బుడగలుగా పేరుకుంటోందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలో కూడా తవ్వితో మిథేన్‌ గ్యాస్‌ వెలువడుతోంది. అంతటి మంచులోనూ మిథేన్‌ గ్యాస్‌ తగులబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఉన్న సరాసరి మిథేన్‌ గ్యాస్‌కన్నా సైబీరియాలో ఆరేడింతలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతికి గురైనట్లు 'న్యూస్‌వీక్‌ రిపోర్ట్‌' వెల్లడించింది.

'ఇదొక మిథేన్‌ గ్యాస్‌ ఫౌంటేన్‌. ఇంతటి ఈ గ్యాస్‌ నా జీవితంలో నేను ఎక్కడా చూడలేదు' అని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న 'టామ్స్క్‌ పాలిటెక్నిక్‌ యూనివర్శిటీ' ప్రొఫెసర్‌ ఇగార్‌ సెమిలేటర్‌ వ్యాఖ్యానించారు. మిథేన్‌ గ్యాస్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతం వాతావరణం వేడిగా ఉంది. సముద్రం ఉపరితలంపై పేరుకున్న మిథేన్‌ బుడగలు నిప్పు తగిలితే మండుతాయని లేదా వాటంతట అవే పేలిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మిథేన్‌ గ్యాస్‌ 20 శాతం పెరగడం వల్ల ప్రపంచ వాతావరణంలో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ పెరుగుతుందట. కార్బన్‌ డై ఆక్సైడ్‌ కంటే మిథేన్‌ గ్యాస్‌ వల్ల వాతావరణం 23 శాతం ఎక్కువ వేడెక్కుతుందట.

వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ పెరగడానికి మనషులు ఎలా కారణం అవుతున్నారో, ఈ మిథేన్‌ గ్యాస్‌ పెరగడానికి కూడా వారే కారణం అవుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చమురు కోసం జరుపుతున్న తవ్వకాల వల్ల మిథేన్‌ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతోందని వారు తెలిపారు. ప్రపంచ భూవాతావరణంలో మిథేన్‌ గ్యాస్‌ నిల్వలు ఇంతకుముందు శాస్త్రవేత్తలు అంచనావేసిన దానికన్నా 25 శాతం ఎక్కువగా ఉంటుందని సైబీరియా సముద్ర తలాన్ని అధ్యయనం చేసిన అనంతరం శాస్త్రవేత్తలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com