చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ
- October 11, 2019
చెన్నై: ప్రధాని మోదీ దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన ఈ ఉదయం 11:45 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయంలో దిగారు. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి సహా పలువురు మంత్రులు, అధికారులు నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. శాలువలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం విమానాశ్రయం నుంచి మోదీ నేరుగా మామళ్లాపురానికి బయలుదేరి వెళ్లారు.
చెన్నై నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర ప్రాంత పట్టణంలోనే నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ మధ్య శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. చైనా రాజధాని బీజింగ్ నుంచి ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ 10:30 గంటల సమయంలో చెన్నైకి బయలు దేరారు. మధ్యాహ్నం 1:45 నిమిషాలకు ఆయన చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జిన్ పింగ్ గిండీ రోడ్డులోని హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళకు చేరుకుంటారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం 4:10 నిమిషాలకు ఆయన మళ్లీ చెన్నై నుంచి మామళ్లాపురానికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5 గంటల సమయంలో మామళ్లాపురంలో ప్రధానమంత్రి స్వాగతం పలుకుతారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే గడుపుతారు. ఈ సందర్భంగా మామళ్లాపురం ఆలయాన్ని సందర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. రాత్రి 8: 10 నిమిషాలకు జిన్ పింగ్ చెన్నై గ్రాండ్ చోళ హోటల్ కు చేరుకుంటారు. మోదీ మామళ్లాపురంలోని ఓ రిసార్టులో బస చేస్తారు.
చెన్నై నుంచి మామళ్లాపురానికి దారి తీసే మార్గం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మార్గంలో తిరిగే వాహనాలను దారి మళ్లించారు. గిండీ నుంచి జీఎస్టీ రోడ్డు, పటేల్ రోడ్డు, అన్నాసాలై, ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) మీదుగా జిన్ పింగ్ రాకపోకలు సాగించాల్సి ఉన్నందున.. ఆ మార్గంలో ఆరు గంటల పాటు ట్రాఫిక్ నిషేధం అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధాన్ని కొనసాగిస్తారు. రాత్రి 11 గంటల తరువాత పాక్షికంగా ఈ నిషేధాన్ని సడళిస్తారు. మళ్లీ తెల్లవారు జాము నుంచి నిషేధాన్ని విధిస్తారు.
కాగా- జిన్ పింగ్, నరేంద్ర మోదీ రాకను పురస్కరించుకుని వారిద్దరు రాకపోకలు సాగించే మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది తమిళనాడు ప్రభుత్వం. ప్రత్యేక స్వాగత ఏర్పాట్లను చేసింది. దారి పొడవునా పూలు, ఫలాలతో స్వాగత తోరణాలు, మంటపాలను నిర్మించింది. చిన్న పొరపాటు కూడా చోటు చేసుకోకుండా ఉండటానికి వీలుగా ఇదివరకే ఈ మార్గంలో రెండుసార్లు ట్రయల్ రన్ ను సైతం నిర్వహించారు అధికారులు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!