నడిచే దేవుడికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించిన మంత్రి

- October 21, 2019 , by Maagulf
నడిచే దేవుడికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించిన మంత్రి

బెంగుళూరు: నడిచే దేవునిగా ప్రసిద్ధి చెందిన దివంగత తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని గుర్తుకు రాలేదా? పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో నిద్రపోయారా? అప్పుడు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయం అని రాష్ట్ర మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జగదీష్‌ శెట్టర్‌ కాంగ్రెస్‌పార్టీపై ధ్వజమెత్తారు. ఆదివారం హుబ్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామీజీకి భారతరత్న కచ్చితంగా లభించాల్సిందన్నారు. ప్రస్తుతం తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై డిమాండ్‌ చేస్తున్నామన్నారు. సిద్ధరామయ్యకు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు.

‘సిద్ధరామయ్య కాంగ్రెస్‌లోకి ఇటీవలే వచ్చారు. ఎమర్జన్సీ సమయంలో ఇదే సిద్ధరామయ్య ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. అపార ప్రజాసేవ చేసిన శివకుమారస్వామిని కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. బోఫోర్స్‌ కుంభకోణాన్ని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కానుకగా ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ పరిపాలనను అందిస్తున్నారని అన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్‌ గురించి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. గతంలో ఎలాంటి ప్రకటనలు చేశారో ఆత్మావలోకనం చేసుకుంటే నిరంకుశ ధోరణి ఎవరిదో తేటతెల్లమవుతుందన్నారు.  

మహదాయిపై చర్చకు సిద్ధం   
గోవాలో కాంగ్రెస్‌ ఊరుకుంటే మహదాయి సమస్య తీరుతుందన్నారు. మహదాయిలో గోవా కాంగ్రెస్‌ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తోందన్నారు. మహదాయిపై గోవా సీఎం చర్చలకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మహదాయిపై నోటిఫికేషన్‌ వెలవడనుందని ఆయన హామీ ఇచ్చారు.  

సమరయోధులను  చులకన చేయొద్దు
సీనియర్‌ రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి చులకనగా మాట్లాడటం మాజీ సీఎం సిద్ధరామయ్యకు తగదని డిప్యూటీ సీఎం గోవింద కారజోళ అన్నారు. హుబ్లీలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య ముందు చరిత్రను తెలుసుకొని బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. భాషా ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటే మంచిదన్నారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన సిద్ధరామయ్య స్వాతంత్య్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించిన వారి పట్ల గౌరవభావంతో మాట్లాడాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం మహానుభావులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఆయన గౌరవానికి మంచిది కాదన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com