ఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బిల్ గేట్స్

- November 18, 2019 , by Maagulf
ఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బిల్ గేట్స్

న్యూఢిల్లీ: ప్రపంచ అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన సోమవారం కలిశారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీ, సహ ఛైర్మన్‌గా బిల్ గేట్స్ ఉన్న విషయం తెలిసిందే.

రానున్న పదేళ్ల కాలంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని బిల్ గేట్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్ అనూహ్య వృద్ధిరేటును నమోదు చేస్తుందన్నారు. దేశంలో గత పదేళ్లుగా గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి కూడా గేట్స్ ప్రధాని మోడీకి వివరించినట్లు తెలిసింది.
ఇంతకుముందు 'హెల్త్ సిస్టమ్స్ ఫర్ ఏ న్యూ ఇండియా: బిల్డింగ్ బ్లాక్స్-పొటెన్షియల్ పాత్‌వేస్ టు రిఫార్మ్స్' నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిల్ గేట్స్.. భారత్ వైద్య రంగంలో మెరుగైన ఫలితాలను సాధిస్తోందన్నారు. ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుందని ప్రశంసించారు.

పోలియో నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా భారత్ నిలుస్తోందని ఆయన అన్నారు. కాగా, ముఖ్యంగా వైద్య రంగంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పలు రాస్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు గేట్స్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేస్తోంది.

ఇంతకుముందు బిల్ గేట్స్ ఆధార్ వ్యవస్థపైనా స్పందించారు. దేశంలో అమలు చేస్తున్న 'ఆధార్' గుర్తింపు వ్యవస్థ వల్ల ఎన్నో లాభాలున్నాయని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఇంకా ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్థ్యం ప్రశంసనీయమైన ఆయన అన్నారు. దేశంలో ఆర్థిక మందగమనం మరికొన్నేళ్లు సాగుతుందనే భయాల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన సానుకూల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత ఐటీ వ్యవస్థలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. భారత్‌కు వేగంగా అభివృద్ధి రేటు నమోదు చేయగల సత్తా ఉందని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. ఆర్థిక సేవలు లేదా డిజిటల్ గుర్తింపు కోసం నందన్ నీలేకని లాంటి వాళ్లను తాము భాగస్వాములను చేసుకుంటామని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు భారతదేశంలో అద్భుతమైన వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారని ఆయ తెలిపారు.

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆయన మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు. కాగా, 110 బిలియన్ డాలర్ల సంంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ను వెనక్కునెట్టి 64ఏళ్ల బిల్ గేట్స్ మరోసారి ప్రపంచ అత్యంత సంపన్నుడిగా అవతరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com