లఢక్‌లో విషాదం.. నలుగురు సైనికులు మృతి

లఢక్‌లో విషాదం.. నలుగురు సైనికులు మృతి

లఢక్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సియాచిన్‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో నలుగురు సైనికులు మృతిచెందారు. సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమానీనదం వద్ద ఈ ఘటన సంభవించింది. నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు చలికి తట్టుకోలేక మృత్యువాత పడ్డారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.

మొత్తం 8 మందితో కూడిన పెట్రోలింగ్ బృందం.. మంచు తుఫాను వచ్చిన ప్రదేశంలో విధులు నిర్వహిస్తోంది. 18వేల అడుగుల ఎత్తులో ఉన్నారు. పైగా గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దీంతో ప్రమాద సమయంలో ఆక్సిజన్ అందక సైనికులు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారిని కాపాడేందుకు ఆర్మీ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. 8 మందిని బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రయత్నంలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఆ ఇద్దరికీ దగ్గర్లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సియాచిన్ కారాకోరం రేంజ్‌లో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ జోన్. అక్కడ ఎప్పుడూ మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సేఫ్టీ మెజర్స్ లేకపోతే క్షణాల్లో రక్తం గడ్డకట్టుకుపోతుంది. అక్కడ వీచే గాలులు అత్యంత ప్రమాదకరం. అయినా భారత సైనికులు ప్రాణాలు లెక్కచేయకుండా సియాచిన్ ప్రాంతంలో పహారా కాస్తుంటారు. దేశరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. ఈ క్రమంలోనే మరో నలుగురు సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు.

Back to Top