గల్ఫ్ నకిలీ ఏజెంట్ల గుట్టురట్టు చేసిన ఏ.పి పోలీస్

- November 22, 2019 , by Maagulf
గల్ఫ్ నకిలీ ఏజెంట్ల గుట్టురట్టు  చేసిన ఏ.పి పోలీస్

అమరావతి:ఏదైనా నేరం జరిగితే సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించి నేరస్థులను పట్టుకుంటారు పోలీసులు. కానీ ఆ వేలిముద్రలనే మార్చేయగలిగితే? కొత్త వేలిముద్రలతో మారుపేర్లతో ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్టులు సృష్టించి దేశం దాటిపోతే? అలాంటి నేరగాళ్లను పట్టుకోవడం ఎంత కష్టం? ఇప్పుడు అలాంటి దందాకే తెరతీసిందో ముఠా. చేతి వేళ్లపై ఉన్న చర్మాన్ని కొంత లోతులో కోసి వేలిముద్రలను మార్చేసే శస్త్రచికిత్సలు చేయిస్తోంది. కొత్త వేలిముద్రలు, మారుపేర్లతో ఆధార్‌ వంటి గుర్తింపు పత్రాలు సంపాదించి, పాస్‌పోర్టులు తయారు చేయించి.. దాదాపు 70 మందిని దొడ్డిదారిన గల్ఫ్‌ దేశాలకు పంపించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తీగ లాగితే ఈ అంతర్జాతీయ ముఠా డొంక కదిలింది. పశ్చిమగోదావరి, నెల్లూరు, కడప జిల్లాల కేంద్రంగా 11 రాష్ట్రాలకు తన నేరమూలాలను విస్తరించిన వైనం వెలుగుచూసింది. పలు రాష్ట్రాల్లో అనేక మందికి వేలిముద్రలు మార్చేసి.. కువైట్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, దుబాయ్‌ తదితర దేశాలకు పంపిస్తూ అంతర్జాతీయ భద్రతకు సవాల్‌ విసిరిన వైనం పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ముఠా రూపొందించిన నకిలీ పాస్‌పోర్టులతో విదేశాలకు వెళ్లినవారు ఎవరు? వారక్కడ ఏం చేస్తున్నారు? ఏమైనా నేరాలకు పాల్పడ్డారా? వారికి ఉగ్రమూలాలు గానీ మాదకద్రవ్యాల ముఠాలతో గానీ సంబంధాలున్నాయా? అనే అంశాలపై ఇంటిలిజెన్స్‌ బ్యూరోతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఏపీలోని కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగమూ ఆ దిశగా దృష్టి సారించింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ శుక్రవారం ఏలూరులో విలేకర్లకు ఈ ముఠా గుట్టును వెల్లడించారు. ముఠా సభ్యులైన పాలకొల్లు మండలం భగ్గేశ్వరానికి చెందిన బొక్కా రాంబాబు, ఆర్‌ఎంపీ వైద్యుడు వీరా త్రిమూర్తులు, నెల్లూరు జిల్లా దివిపాలేనికి చెందిన కొండెంరెడ్డి రాజారెడ్డి, కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్‌ మహ్మద్‌ ముజఫర్‌, శ్రీలంకకు చెందిన జాకీర్‌ హుస్సేన్‌లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి శస్త్రచికిత్స పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శ్రీలంకకు చెందిన మహ్మద్‌ బాషా, ఖాదర్‌ బాషా, కువైట్‌లో ఉన్న మేరీలను అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు.

 
రాంబాబు.. రాజేష్‌ అయ్యాడిలా..
పాలకొల్లు మండలం భగ్గేశ్వరానికి చెందిన బొక్కా రాంబాబు 2010లో పాస్‌పోర్టు తీసుకుని కువైట్‌ వెళ్లాడు. అక్కడ అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారు రాంబాబు వేలిముద్రలు తీసుకుని 2015లో అతణ్ని భారత్‌కు తిప్పి పంపేశారు. తన పాస్‌పోర్టుతో మళ్లీ కువైట్‌ వెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో రాంబాబు నకిలీ పాస్‌పోర్టు తయారు చేయాలనుకున్నాడు. కువైట్‌లో ఉన్నప్పుడు అతనికి మహ్మద్‌ బాషా, ఖాదర్‌ బాషా, షేక్‌ మహ్మద్‌ ముజఫర్‌ పరిచయమయ్యారు. మనుషుల వేలిముద్రలను మార్చేసే శస్త్రచికిత్స చేయించటంలో వీరు సిద్ధహస్తులు. వాటి ఆధారంగా నకిలీపత్రాలు, పాస్‌పోర్టులు సృష్టిస్తుంటారు. వీరిని ఆశ్రయించిన రాంబాబు తన చేతివేళ్లన్నింటికీ శస్త్రచికిత్స చేయించుకుని వేలిముద్రలను మార్చుకున్నాడు. వాటి ఆధారంగా బండి రాజేష్‌ అనే పేరుతో ఆధార్‌ తీసుకుని, నకిలీ పాస్‌పోర్టు పొందాడు. 2018లో కువైట్‌ వెళ్లి ఈ జులై 26న భగ్గేశ్వరానికి తిరిగొచ్చేశాడు.

ముఠాగా ఏర్పడి..
నెల్లూరు జిల్లా దివిపాలేనికి చెందిన కొండెంరెడ్డి రాజారెడ్డి రాజామాతా పాస్‌పోర్టు ఆన్‌లైన్‌ సర్వీసు నడుపుతుంటాడు. వేలిముద్రల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించి, నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసి వాటితో మనుషులను విదేశాలకు పంపుతుంటాడు. దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలు తీసుకుంటాడు. ఇతనికి బొక్కా రాంబాబు, ఖాదర్‌ బాషా, భీమవరానికి చెందిన మేరీ రాజ్యలక్ష్మి అనే మహిళ పరిచయమయ్యారు. వీరికి నెల్లూరు జిల్లా స్పెషల్‌ బ్రాంచి పోలీసులు కొందరు సహకరించారు. ఈ ముఠా.. నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేయించి అనేక మందిని విదేశాలకు పంపించింది.


శ్రీలంక నుంచి రప్పించి.
వేలిముద్రల మార్పిడి శస్త్రచికిత్స చేయటంలో శ్రీలంకకు చెందిన జాకీర్‌ హుస్సేన్‌ సిద్ధహస్తుడు. ఈ ముఠా అతణ్ని శ్రీలంక నుంచి చెన్నైకు తీసుకొచ్చి శస్త్రచికిత్సలు చేయించేది. ఝార్ఖండ్‌, బిహార్‌, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, కర్ణాటక, దిల్లీతో పాటు హైదరాబాద్‌, తిరుపతి, రాజంపేట ప్రాంతాలకు చెందిన వారికీ జాకీర్‌ వేలిముద్రల మార్పిడి శస్త్రచికిత్సలు చేసేవాడు. వేలిముద్రల మార్పిడి ముఠాను సొంతంగా నడపాలని భావించిన రాంబాబు మేరీ రాజ్యలక్ష్మితో కలిసి ఓ ముఠాను సిద్ధం చేశాడు. భగ్గేశ్వరానికి చెందిన వీరా త్రిమూర్తులు అనే ఆర్‌ఎంపీ వైద్యుడికి వేలిముద్రల మార్పిడిలో జాకీర్‌తో శిక్షణ ఇప్పించాడు. తన ఇంట్లోనే ఐదుగురికి ఇలా శస్త్రచికిత్సలు చేయించాడు.
వేలిముద్రలను ఎలా మారుస్తారంటే?

* చేతి వేలిముద్రలుండే భాగాన్ని కొంతమేర అడ్డంగా, నిలువుగా కోసి జిగ్‌జాగ్‌ మాదిరిగా కుట్లేస్తారు.
* ఈ శస్త్రచికిత్స జరిగిన రెండు, మూడు నెలల తర్వాత గాయాలు తగ్గుతాయి.
* ఈ క్రమంలో పుట్టుకతో వచ్చిన వేలిముద్రలు పోయి కొత్త వేలిముద్రలు ఏర్పడతాయి.
మార్చుకోవటం ఎందుకంటే..
* నేరనేపథ్యం ఉన్న వారికి పాస్‌పోర్టు రావటం చాలా కష్టం. అందుకే వేలిముద్రలు మార్చుకుని వేరే పేరుతో పాస్‌పోర్టు పొందుతున్నారు.
* విదేశాల్లో ఉంటూ అక్కడ నేరానికి పాల్పడినా, తప్పులు చేసినా వారిని స్వదేశానికి తిప్పి పంపేస్తుంటారు. అలాంటివారు మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు ఈ అడ్డదారి ఆశ్రయిస్తున్నారు.
* నేరాలు చేసినా పట్టుబడకుండా ఉండేందుకూ ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com