దుబాయ్:సొంత మేనల్లుడినే హతమార్చిన ఇద్దరు పాకిస్తానీలు

- November 25, 2019 , by Maagulf
దుబాయ్:సొంత మేనల్లుడినే హతమార్చిన ఇద్దరు పాకిస్తానీలు

దుబాయ్: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ లో సొంత మేనల్లుడినే హతమార్చారు. ఇద్దరిలో ఓ వ్యక్తి భార్యతో అల్లుడు అక్రమ సంబంధం కలిగి ఉండడమే ఈ హత్యకు కారణమని ఆదివారం దుబాయి కోర్టులో జరిగిన విచారణలో తేలింది. తాము అతనికి యూఏఈలో ఉద్యోగం కలిపించి మంచి జీవితాన్ని ఇస్తే... అది మరిచిపోయి అత్తతో అతను వివాహేతర సంబంధం పెట్టుకోవడం నచ్చలేదని, అందుకే అతడ్ని అంతమొందించినట్టు పాకిస్తానీలు న్యాయస్థానంలో అంగీకరించారు. వివరాల్లోకి వెళితే... గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన ఇద్దరు పాకిస్తానీలు సొంత మేనల్లుడిని భోజనాలకు అని తమ ఇంటికి పిలిచారు. భోజనం చేసిన తర్వాత తామే డ్రాప్ చేస్తామని వారు ఉంటున్న ప్రాంతానికి దూరంగా తీసుకెళ్లారు. ఆ తరువాత ఇద్దరిలో ఓ వ్యక్తి అల్లుడి తలపై ఇనుప రాడుతో గట్టిగా కొట్టి కింద పడేశాడు.

కిందపడిపోయిన అతను ప్రాణాలతోనే ఉండడంతో మరో వ్యక్తి మెడకు తాడు బిగించి ఊపిరాకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ సంచిలో పెట్టి అక్కడే పాతిపెట్టారు. అయితే, మృతుడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదంటూ ఫిబ్రవరి 3న జెబల్ అలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానంతో ఇద్దరు మామయ్యలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తమ అల్లుడిని తామే హతమార్చినట్టు అంగీకరించారు. సొంత అత్తతో అతను వివాహేతర సంబంధం పెట్టుకోవడం నచ్చకనే అల్లుడిని తామే చంపేశామని ఒప్పుకున్నారు. దాంతో ఆ ఇద్దరిపై కిడ్నాప్, హత్య కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఆదివారం ఈ కేసు దుబాయ్  కోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com