తమిళనాడులో వరుణుడి ఆగ్రహం.. ఐదుగురు మృతి.. విద్యాసంస్థలకు సెలవు
- December 02, 2019
తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు ఐదు మంది చనిపోయారు. చెన్నైలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
తమిళనాడు వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు.. పలు ప్రాంతాలను నీటముంచాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాజధాని చెన్నై కూడా నీటమునిగింది. ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సిటీ శివారు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్ల మీద రెండు, మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఐదుగురు ప్రాణాలు కొల్పోయారు. ఇంటి గోడ కూలి ముగ్గురు, ప్రమాదంలో ఒకరు, నీటిలో కొట్టుకుపోయి మరొకరు మరణించారు. టుటుకోరిన్ జిల్లాలో 19, కడలూరులో 17, తిరునెల్వెలిలో 15, కాంచీపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి పల్లవరం, క్రోమ్పెట్, కూండ్రత్తూరు, చిట్లపక్కం, మేడవాక్కం, మేడంమాకం, తాంబరం ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. వేలాది ఇండ్లు నీటమునిగాయి. కేవలం కడలూరులో దాదాపు 5000 ఇండ్లు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 5000 హెక్టార్లకుపైగా పంట నీటిపాలైంది. తిరుమలాయ్ మెయిన్ రోడ్డు నుంచి హస్తినాపురం వరకు మూడు నెలల క్రితమే నిర్మించిన రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నగరంలోని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరో పిడుగులాంటి హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. రాబోయే 48 గంటలు ఇదే తరహాలో వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. తిరువళ్ళూరు, వెల్లూరు, తిరువణ్ణామలై, తూత్తుకూడి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మద్రాసు యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేశాయి. అటు పుదుచ్చేరిలోని ఇదే పరిస్థితి నెలకొంది. కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!