గల్ఫ్ కు చట్టబద్దంగా, సురక్షితంగా వెళ్ళండి

- December 18, 2019 , by Maagulf
గల్ఫ్ కు చట్టబద్దంగా, సురక్షితంగా వెళ్ళండి

తెలంగాణ:గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి  చట్టబద్దంగా, సురక్షితంగా వెళ్లాలని, గల్ఫ్ దేశాల చట్టాలను  గౌరవించాలని జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండ భాస్కర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖతార్ లోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్పేర్ అసోసియేషన్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ లు సంయుక్తంగా  నిర్వహించిన కార్మికుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసులు  సహాయం కోసం ఢిల్లీ లోని భారత ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 లేదా హైదరాబాద్ లోని క్షేత్రీయ ప్రవాసి సహాయతా కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ 73067 63482 కు కాల్ చేయవచ్చునని  భాస్కర్ రెడ్డి అన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 29 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలసకార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత, అంతర్జాతీయ వలసలు వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించిందని  ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.    

వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉన్నది. మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. ఈ ఆధునిక కాలంలో ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ ఇటీవలి కాలంలో పునరేకీకరణ, స్థానభ్రంశం, సురక్షిత వలసలు, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలలో కీలకమైన రాజకీయ మరియు విధానపర విషయాలలో సవాళ్లు ఎదురవుతున్నాయని ఖతార్ లోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్పేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట ధర్మేంద్ర అన్నారు. 

ప్రవాసి కార్మిక నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, సముద్రాల శ్రీనివాస్, నల్లాల జయపాల్, బోనాల స్వాతి, పూదరి గంగమణి, బేర తిరుమల, గందె కిషోర్, గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com