యూకే పోస్టాఫీస్ నిధుల కుంభకోణం..చిక్కుకున్న భారతీయ పోస్ట్‌మాస్టర్లు

- December 24, 2019 , by Maagulf
యూకే పోస్టాఫీస్ నిధుల కుంభకోణం..చిక్కుకున్న భారతీయ పోస్ట్‌మాస్టర్లు

లండన్: అకౌంటింగ్ సిస్టమ్ హారిజోన్‌లో దొర్లిన తప్పు వల్ల యూకేలో వందలాది మంది సబ్-పోస్ట్‌మాస్టర్లు పోస్టాఫీస్ నిధుల దొంగతనం కుంభకోణంలో చిక్కుకున్నారు. వీరిలో చాలా మంది భారత సంతతి పోస్ట్‌మాస్టర్లు కూడా ఉన్నారు. తాజాగా ఈ కేసు యూకే హైకోర్టులో విచారణకు వచ్చింది. సుమారు 57.8 మిలియన్ పౌండ్స్(రూ.531కోట్లు) దొంగతనం జరిగినట్లు న్యాయస్థానంలో పేర్కొనడం జరిగింది. ఈ మేరకు 550 మంది దావా వేశారు. ఈ కేసును విచారించిన లండన్ న్యాయస్థానం అకౌంటింగ్ సిస్టమ్ హారిజోన్‌లో తలెత్తిన బగ్స్, ఎర్రర్స్, డిఫెక్ట్స్ కారణంగానే ఇంత భారీ మొత్తంలో సబ్-పోస్ట్‌మాస్టర్స్ బ్రాంచీల అకౌంట్స్‌లో వ్యత్యాసాలు వచ్చాయని నిర్ధారించింది. వెంటనే వీటిపై దృష్టిసారించి నిజనిజాలేంటో ధృవీకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది.

ఇక ఈ కుంభకోణంలో చిక్కుకున్న భారత సంతతి పోస్ట్‌మాస్టర్లలో ఒకరైన విపిన్‌చంద్ర పటేల్ మాట్లాడుతూ అకౌంటింగ్ సిస్టమ్ తప్పు వల్ల తన కెరీర్‌తో పాటు జీవితం నాశనమైందన్నారు. పటేల్ 1987 నుంచి ఆక్స్ ఫోర్డ్ షైర్‌లోని హార్ష్‌పాత్‌లో గల ఓ విలేజ్‌లో సబ్-పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అకౌంటింగ్ సిస్టమ్ బగ్ కారణంగా ఈ దొంగతనం కుంభకోణంలో చిక్కుకోవడం తన పేరు ప్రతిష్టలను దెబ్బ తీసిందన్నారు. ఇరుగుపొరుగు వారు కూడా తమ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాప్‌కు వెళ్లిన తన భార్యను అక్కడి కస్టమర్లు అవమానించి పంపించడం ఎంతో బాధించిందన్నారు. ఈ సంఘటన తరువాత నుంచి తిండి సహించడం లేదని, సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని ఆయన వాపోయారు. దీంతో తన ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైందని పేర్కొన్నారు. ఈ కుంభకోణం కారణంగా పటేల్‌ను 18 వారాలు జాబ్ నుంచి సస్పెండ్ చేశారు.

మరో బాధితుడు బల్వీందర్ సింగ్ గిల్‌ది కూడా ఇదే పరిస్థితి. మొదటి నుంచే తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, తాజాగా ఈ కుంభకోణం కారణంగా మరింత దిగజారిందన్నారు. తాను నిర్వహిస్తున్న పోస్టాఫీస్‌లో దొంగలించబడిన సొమ్ము తిరిగి చెల్లించకుంటే తనను జైలులో పెడతామని అధికారులు చెబుతున్నారని గిల్ వాపోయారు. కానీ అకౌంటింగ్ సిస్టమ్‌లో జరిగిన తప్పు వల్ల తాము ఇవాళ దోషులుగా నిలబడడం ఎంతో బాధించిందని గిల్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com