'మత్తు వదలరా' మూవీ రివ్యూ

'మత్తు వదలరా' మూవీ రివ్యూ

చిన్న సినిమాలైనా కొత్తదనంతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని 2019 సంవత్సరం మరోసారి గుర్తు చేసింది. కొత్తతారలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న సమయంలో మత్తు వదలరా చిత్రం రిలీజ్‌కు ముందే మంచి క్రేజ్‌ను ఏర్పరుచుకొన్నది. టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకోవడమే కాకుండా దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ దర్శకుడు కీరవాణి కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందనడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి విశేషాలతో డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మత్తు ఎలా వదిలించిందో తెలుసుకొందాం..

కథ:
బాబూ మోహన్ (శ్రీ సింహా కోడూరి) డెలీవరి బాయ్. తన రూమ్‌మేట్ ఏసుదాస్ (కమెడియన్ సత్య), అభి (అగస్త్య)తో ఇరుకు గదిలో చాలీచాలని జీతంతో ఓ రకమైన ఫ్రస్టేషన్‌తో ఉండే యువకుడు బాబూ మోహన్. తన రూమ్‌మేట్ ఏసుదాస్ (కమెడియన్ సత్య) సలహాతో కస్టమర్‌ (పవలా శ్యామల)ను చీట్ చేయబోయి.. ఓ మర్డర్ ఘటనలో భాగమవుతాడు. అంతేకాకుండా రూ.50 లక్షలు కూడా చేతికి వస్తాయి.

ట్విస్టులు:
బాబూ మోహన్ హత్యా ఘటనలో ఎలా భాగమయ్యాడు? కస్టమర్‌ను డెలీవరి బాయ్‌గా బాబూ మోహన్ ఎలా చీట్ చేయబోయాడు? కస్టమర్‌‌ను బాబూ మోహన్ నిజంగా చంపేశాడా? ఈ కథలో 'షెర్లాక్' అభి పాత్ర ఏంటి? ఇలాంటి మర్డర్ మిస్టరీలో సత్య కామెడీ ఎలా సింక్ అయింది? ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ పాత్రలు ఎలా కీలకంగా మారాయి? చివరకు హత్యా ఘటన నుంచి బాబూ మోహన్ బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ఎలా సఫలమయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే మత్తు వదలరా చిత్రం.

రివ్యూ:
సమకాలీన యువతలో ఉండే భావావేశాలతో ఫస్టాఫ్ కథ మొదలవుతుంది. కష్టపడి పనిచేసినా సరైన ప్రతిఫలం దక్కని బాబూ మోహన్ కస్టమర్లను చీటింగ్ చేయాలనే ప్రయత్నంతో కథ మొదలవుతుంది. పావలా శ్యామల ఎంట్రీతో కథ స్వరూపం మారిపోతుంది. పావలా శ్యామల ఎపిసోడ్‌తో సన్నివేశాలు చకచకా పరుగులు పెడుతాయి. అలాగే సత్య కామెడీ వర్కవుట్ కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ మరింత జోష్‌ను కలిగిస్తుంది. ఇక సబ్ వే‌లో రోహిణి టెలివిజన్ సీరియల్‌కు తెలుగు సీరియల్స్‌పై సెటైరిక్ ఎపిసోడ్స్ సీరియస్‌గా నడిచే సినిమాలో ఉపశమనంగా మారుతాయి. 

మత్తు వదలరా సినిమా కథ మొత్తం సెకండాఫ్‌లో ప్యాక్డ్‌గా ఉంటుంది. మర్డర్ ఎపిసోడ్స్, డ్రగ్స్ అంశాలు ప్రేక్షకుడికి థ్రిల్ కలిగిస్తాయి. ఊహించని ట్విస్టులు కొత్త అనుభూతిని పంచుతాయి. కాన్సెప్ట్ బేస్డ్‌గా రూపొందిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి, గ్రాఫిక్స్ వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫీల్‌గుడ్ అంశాలుగా కనిపిస్తాయి. కథలో కొన్ని మలుపులు ప్రేక్షకుడికి ఆసక్తిని రేకిస్తాయి. ఫన్ తరహా క్లైమాక్స్‌తో మత్తు వదలరా ముగియడం పాజిటివ్ అంశంగా మారుతుంది.

డైరెక్టర్ రితేష్ ప్రతిభ:
దర్శకుడు రితేష్ రానా ఎంచుకొన్న పాయింట్, కథను నడిపించిన విధానం ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. సీన్లను డిజైన్ చేసుకొన్న తీరు.. అందులో కామెడీని నింపిన అంశం సినిమాను పక్కాగా కమర్షియల్‌గా మార్చేందుకు దోహదపడ్డాయి. షార్ట్ ఫిలింకు కావాల్సిన ముడిసరుకును సినిమాగా మార్చిన తీరు రితేష్ టాలెంట్‌కు నిదర్శనం. పాత్రలను రాసుకొన్న విధానం, వాటికి ఎంపిక చేసుకొన్న తీరు దర్శకుడి పరిణతికి అద్దం పట్టింది. కమర్షియల్ డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ కావడానికి రితేష్‌‌కు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్:
ఇక కొత్తగా తెలుగు తెరకు పరిచయమైన కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి తనదైన నటనతో ఆకట్టుకొన్నాడు. షెర్లాక్‌‌ అభిగా అగస్త్య లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక కమెడియన్ సత్య సినిమాకు ప్రాణంగా నిలిచాడు. ఈ సినిమా చాలా భాగాన్ని సత్య తన భుజాలపై మోశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న సత్య ఈ చిత్రంతో స్టార్ కమెడియన్ల జాబితాలో చేరిపోవడం ఖాయం. సత్య తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, గెటప్స్‌తో సినిమాలో డామినేట్ చేశాడు. అల్లరి నరేష్, పావల శ్యామలా, బ్రహ్మాజీ, అజయ్, అతులా చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
సత్య కామెడీ
డైరెక్షన్
టెక్నికల్ వ్యాల్యూస్
రీరికార్డింగ్
సెకండాఫ్

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ సాగదీసినట్టు ఉండటం

యూనిట్:
శ్రీ సింహా కోడూరి, సత్య, అతులా చంద్ర, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు
కథ, దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాత: హేమలత, చిరంజీవి
మ్యూజిక్: కాల భైరవ
సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్
స్టంట్స్: శంకర్ ఉయ్యాల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2019-12-25

ఫైనల్‌గా:
వెరైటీ కథ, కొత్త ఆలోచనలు, కొత్త నటీనటులతో, పాటలు, హీరోయిన్ లేకుండా చేసిన సరికొత్త ప్రయోగం మత్తు వదలరా. కంటెంట్ పాతదైనా వడ్డించిన విస్తరిలో వడ్డించిన విధానం మాత్రం కొత్తగా ఉంది. సమకాలీన పరిస్థితుల్లో యువత ఆలోచనలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డెలీవరి బాయ్స్ కష్టాలకు డ్రగ్స్ మాఫియా అంశాన్ని మేళవించిన యూత్‌ఫుల్ చిత్రం. ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. అన్నివర్గాలకు చేరువైతే మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం.

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 2.5/5

Back to Top