ఇయ‌ర్ రౌండ‌ప్ - 2019

- December 30, 2019 , by Maagulf
ఇయ‌ర్ రౌండ‌ప్ - 2019

దాదాపు కోటి పైబ‌డి జ‌నాభా ఉన్న హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా రూపొందించ‌డంలో భాగంగా ర‌హ‌దారులు, పార్కులు, జంక్ష‌న్లను ఆధునీక‌రించ‌డంతో పాటు వాహ‌నాలు, పాద‌చారుల సౌక‌ర్యార్థం ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ల‌ను నెల‌కోల్పుట‌కు జిహెచ్ఎంసి చేప‌ట్టిన చ‌ర్య‌లు కార్య‌రూపానికి చేరువ కావ‌డం 2019 ప్ర‌త్యేకత‌గా నిలుస్తుంది.

* ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం 700 మీ-సేవా కేంద్రాల ద్వారా జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది.

* పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు వివాహ‌, ఇత‌ర శుభ కార్యాల‌ను జ‌రుపుకునేందుకు అనువుగా రూ. 30 కోట్ల‌తో 15 ప్రాంతాల్లో చేప‌ట్టిన ఫంక్ష‌న్‌హాళ్ల ప‌నుల‌లో 9 చోట్ల పూర్త‌య్యాయి.

* రూ. 19.37 కోట్ల‌తో 38 చోట్ల మోడ‌ల్ మార్కెట్ల నిర్మాణం చేప‌ట్ట‌గా రూ. 18 కోట్ల వ్య‌యంతో 35 మార్కెట్ల నిర్మాణ పూర్తి అయ్యింది.

* పెరుగుతున్న వాహ‌నాల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు కొత్త‌గా 155 జంక్ష‌న్ల‌లో సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతున్న‌ది.

* సిగ్న‌ల్ ర‌హిత వాహ‌న ప్ర‌యాణానికి అనువుగా  జె.బి.ఎస్ నుండి వ‌యా ఆబిడ్స్‌, యం.జి.బి.ఎస్, చార్మినార్‌ ద్వారా ఫ‌ల‌క్‌నూమా వ‌ర‌కు సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రించి అనుసంధానం చేసేందుకు ప్ర‌య‌త్నం.

* వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించుట‌కు 158 కిలోమీట‌ర్ల ఔట‌ర్ రింగ్‌రోడ్‌కు అనుసంధానంగా స‌ర్వీసు రోడ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింది.

* 55 ప్యార‌ల‌ల్ స్లిప్ రోడ్ల‌ను నిర్మించ‌డం జ‌రుగుతున్న‌ది.

* రూ. 232 కోట్లతో 52 ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిలు, 8 స్కై-వేల‌ను నిర్మించ‌డం జ‌రుగుతుంది.

* 800 కిలోమీట‌ర్ల పొడ‌వున ఫుట్‌పాత్‌ల‌ను అభివృద్ది చేస్తున్నాం.

* 66 పార్కుల‌లో ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నాం.

* 6,29,000 ఫైళ్ల‌లోని 4కోట్ల 22ల‌క్ష‌ల పేజీల‌ను డిజిట‌లైజ్ చేసి భ‌ద్ర‌ప‌రిచాం.

* మైజిహెచ్ఎంసి మొబైల్ యాప్‌ను 9ల‌క్ష‌ల 25వేల‌ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆస్తిప‌న్ను మ‌దింపును క్ర‌మ‌బ‌ద్దీకరించేందుకు సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ స‌హ‌కారంతో ట్రాక్ సాంకేతిక భాగ‌స్వామ్యంతో 2019 న‌వంబ‌ర్ నెల‌లో ప్రారంభించిన జి.ఐ.ఎస్ స‌ర్వే ద్వారా 21వేల ఆస్తులను జియో ట్యాగింగ్ చేయ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్తిప‌న్ను మ‌దింపున‌కు రాని 545 ఆస్తులను గుర్తించ‌డం జ‌రిగింది. ఈ జి.ఐ.ఎస్ జియోట్యాగింగ్ ద్వారా 2020లో అన్ని ఆస్తుల వివ‌రాలు సేక‌రించి రెవెన్యూ వ‌సూళ్ల‌ను పెంచ‌డం జ‌రుగుతుంది.

* స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో భాగంగా ప‌బ్లిక్ పార్కులు, ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాల‌లో  1500 ప‌బ్లిక్ టాయిలెట్స్ బ్లాక్స్‌ను నిర్మించ‌డం జ‌రుగుతున్న‌ది.

* వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ది ప‌థ‌కం, ఎస్‌.ఆర్‌.డి.పి లో చేప‌ట్టిన నాలుగు ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

* దేశంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్న జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంపింగ్‌యార్డ్ క్యాపింగ్ ప‌నులు పూర్త‌య్యాయి. చెత్త‌తో 19.8 మెగా వాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన విద్యుత్  ప్లాంట్ నిర్మాణం పూర్తి అయ్యింది. విద్యుత్ రెగ్యులేట‌రి అథార‌టి నుండి యూనిట్ రేటు నిర్థార‌ణ జ‌రిగిన అనంత‌రం వాణిజ్య‌ప‌రంగా ఉత్ప‌త్తి ప్రారంభమ‌వుతుంది.

* నాలాల‌ను, చెరువుల‌ను, రోడ్ల‌ను కాపాడడంతో పాటు స‌హ‌జ‌వ‌న‌రుల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించుట‌కై న‌గ‌రానికి నాలుగువైపులా భ‌వ‌న నిర్మాణ‌, శిథిలాల వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల‌ను నెల‌కోల్పుతున్నాం. అందులో జీడిమెట్ల 750 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో నిర్మించిన సి అండ్ డి ప్లాంట్ ప్రారంభానికి సిద్దంగా ఉంది.

* మాంస వ్య‌ర్థాలు, చ‌నిపోయిన ప‌శువుల నుండి ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రుగుతున్న న‌ష్టాన్ని నివారించుట‌కై చెంగిచ‌ర్ల‌లో నిర్మిస్తున్న రెండ‌రింగ్ ప్లాంట్ ప‌నులు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేసిన మాంసం, ప‌శువుల వ్య‌ర్థాల నుండి వెలువ‌డే ఉత్ప‌త్తులు కోళ్ల‌కు, చేప‌ల‌కు నాణ్య‌మైన ఆహారంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే స‌బ్బుల త‌యారీ, వాహ‌నాల లూబ్రికెంట్ మెటీరియ‌ల్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

*ఇంజ‌నీరింగ్ ప్రాజెక్టులు:*  ఇంజ‌నీరింగ్ ప్రాజెక్ట్ విభాగంలో చేప‌ట్టి, పూర్తిచేసిన ప‌నులు 2019లో జిహెచ్ఎంసికే మైలురాళ్లుగా నిలుస్తాయి. ప్ర‌ధానంగా ఎస్‌.ఆర్‌.డి.పి కింద‌ రూ. 42.74కోట్ల‌తో ఎల్బీన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌, రూ. 97.94 కోట్ల‌తో రాజీవ్‌గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఫ్లైఓవ‌ర్‌, రూ. 69.47 కోట్ల‌తో బ‌యోడైవ‌ర్సిటీ ఫ్లైఓవ‌ర్లు పూర్తి చేసుకున్నాం.

* ఎస్‌.ఆర్‌.డి.పి కింద 135 కిలోమీట‌ర్ల పొడ‌వున ఏడు స్కైవేలు, 166 కిలోమీట‌ర్ల పోడ‌వున 11 మేజ‌ర్ కారిడార్స్‌, 348 కిలోమీట‌ర్ల పొడ‌వున 68 మేజ‌ర్ రోడ్స్‌తో పాటు 1400 కిలోమీట‌ర్ల ఇత‌ర ర‌హ‌దారులు, 54 చోట్ల గ్రేడ్ స‌ప‌రేట‌ర్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాం.

* అలాగే రూ. 14.24 కోట్ల‌తో హిమ‌త్‌పుర‌, పురానాపూల్‌, క‌ర్మ‌న్‌ఘాట్ జంక్ష‌న్‌, సైబ‌ర్ సిటీ ఖానా మెట్‌, ప్యార‌డైజ్‌, షెనాయి న‌ర్సింగ్‌హోం, శివాజి బ్రిడ్జి, కవాడిగూడ‌, బోర‌బండ బ‌స్టాప్‌, కె.పి.హెచ‌.బి టెంపుల్ బ‌స్టాప్‌, సుచిత్ర ఫేస్‌-2, ఐడిపిఎల్‌, సిటీ జంక్ష‌న్ ల‌ను అభివృద్ది చేశాం.

* 2019లో ఐదు ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం జ‌రిగింది.

* 2019లో  రూ. 5.27 కోట్ల‌తో నాచారం, కూక‌ట్‌ప‌ల్లిల‌లో ఆధునిక ప‌ద్ద‌తిలో ఫిష్ మార్కెట్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది.

* 2019లో రూ. 6.58 కోట్ల‌తో ఐదు చోట్ల నైట్ షెల్ట‌ర్ల‌ను నిర్మించాం.

* 2019లో  రూ. 26.40 కోట్ల‌తో స్ట్రామ్ వాట‌ర్ డ్రెయిన్ల‌ను పూర్తిచేశాం.

* 2019లో రూ. 14.28 కోట్ల‌తో నీరు నిలుస్తున్న ఐదు ప్ర‌ధాన ప్రాంతాల్లో నీరు నిల్వ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టి, ప‌నులు పూర్తిచేశాం.

* ఇంజ‌నీరింగ్ మెయింట‌నెన్స్ విభాగంచే 2019-20లో రూ. 635 కోట్ల విలువైన 4,121 ప‌నులు పూర్తి అయ్యాయి. అలాగే రూ. 762 కోట్ల విలువైన ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. ఏడు ప్యాకేజిలుగా 709 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్వ‌హ‌ణ‌ను సి.ఆర్‌.ఎం.పి కింద ఐదు సంవ‌త్స‌రాల‌కు ఏజెన్సీల‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింది.

*డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం: నిరుపేద‌ల‌కు పూర్తిస్థాయి వ‌స‌తుల‌తో సౌక‌ర్య‌వంతంగా జీవించుట‌కై జిహెచ్ఎంసి ప‌రిధిలో 117 లొకేష‌న్ల‌లో రూ. 8,598 కోట్ల‌తో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా తీసుకుంటే, 97,953 ఇళ్ల ప‌నులు గ్రౌండింగ్ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5,136 కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. 2019లో 8,620 ఇళ్లు పూర్తికాగా, 108 ఇళ్ల‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. 46,279 ఇండ్లు ఫినిషింగ్ స్టేజిలో ఉన్నాయి. 11 లొకేష‌న్ల‌లో 8,512 ఇండ్లు ప్రారంభోత్స‌వానికి సిద్దంగా ఉన్నాయి.

* విద్యుత్‌ను ఆదా చేసేందుకు 2019లో కొత్త‌గా 23,684 ఎల్‌.ఇ.డి లైట్లు, 1,233  సిసిఎం లైట్లు అమ‌ర్చ‌డం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,42,343 వీధి లైట్ల‌ను ఎల్‌.ఇ.డి బ‌ల్బుల‌తో రీప్లెస్ చేయ‌డం జ‌రిగింది. త‌ద్వారా 110.54 మిలియ‌న్‌ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. 2019 జ‌న‌వ‌రి నుండి న‌వంబ‌ర్ వ‌ర‌కు రూ. 76.75 కోట్ల క‌రెంట్ బిల్లు త‌గ్గింది. ఎల్‌.ఇ.డి బ‌ల్బుల‌తో 2017 జులై నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 258.38 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యి రూ. 182.67 కోట్ల క‌రెంట్ బిల్లు త‌గ్గింది. విద్యుత్ ఖ‌ర్చును త‌గ్గించుట‌కై రూ. 3.49 కోట్ల‌తో జిహెచ్ఎంసికి చెందిన 34 కార్యాల‌యాల భ‌వ‌నాల‌పై 941 కిలో వాట్ల సౌర విద్యుత్ ప‌ల‌కల‌ను ఏర్పాటు చేశాం.

*ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ డైరెక్ట‌రేట్‌:*  తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడోవంతు జ‌నాభా క‌లిగి, వేగంగా వాణిజ్య‌, వ్యాపార‌, ఐటి, సేవ‌లు, మౌలిక స‌దుపాయాల రంగాల్లో విస్త‌రిస్తున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏర్ప‌డే విప‌త్తులలో ప్ర‌జ‌లు, ఆస్తుల‌ను సంర‌క్షించేందుకు జిహెచ్ఎంసిలో నెల‌కోల్పిన ఈ విభాగాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్న‌ది. ఈ విభాగం చే ప‌నిచేస్తున్న డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ మూడు షిఫ్ట్‌ల‌లో 24గంట‌ల పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న‌ది. డి.ఆర్‌.ఎఫ్‌లో 19 టీమ్‌లు ప‌నిచేస్తున్నాయి. ఆక‌స్మికంగా సంభ‌వించే అగ్నిప్ర‌మాదాలు, వ‌ర‌ద‌లు, శిథిలావ‌స్త‌కు చేరిన భ‌వ‌నాలు, బ్రిడ్జిలు  కూలిన‌ప్పుడు బాధితుల‌ను, ఆస్తుల‌ను ర‌క్షించుట‌కై  డి.ఆర్‌.ఎఫ్‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌తో పాటు ఆధునిక యంత్రాలు, రెస్క్యూ ప‌రిక‌రాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూర్చింది. త‌ద్వారా ఇటీవ‌ల జ‌రిగిన ఎం.ఎం.టి.ఎస్ రైలు ప్ర‌మాదంలో చిక్కుకున్న ప్ర‌యాణికుల‌ను ర‌క్షించ‌డం జ‌రిగింది. నాంప‌ల్లి ఎగ్జిబీష‌న్ గ్రౌండ్‌లో అగ్నిప్ర‌మాద సంఘ‌ట‌న‌లో ఫైర్ స‌ర్వీసెస్‌కు అండ‌గా నిలిచింది. 2019 జ‌న‌వ‌రి నుండి 92 రెస్క్యూ  కాల్స్‌కు స్పిందించ‌డం జ‌రిగింది. వ‌ర్ష‌కాలంలో రోడ్ల‌కు అడ్డంగా ప‌డిపోయిన 983 చెట్ల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది. 930 నీటి నిల్వ ప్ర‌దేశాల‌ను క్లీయ‌ర్ చేయ‌డం జ‌రిగింది. 58 చోట్ల జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాదాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లను చేప‌ట్ట‌డం జ‌రిగింది. అలాగే రోడ్డు ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన 158 మందికి ప్ర‌థ‌మ చికిత్స అందించడం జ‌రిగింది. ఎన్‌ఫోర్స్ మెంట్‌, విజిలెన్స్ విభాగంచే సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్ మెంట్ సెల్ ప‌నిచేస్తున్న‌ది. అన్ని జోన్‌ల‌లో క‌లిపి దాదాపు 15వేల ఫుట్‌పాత్ పై ఉన్న‌ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది. స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌లో భాగంగా డ్రైయిన్లు, రోడ్ల‌పై చెత్త‌చెదారాన్ని వేసేవారు, వాల్‌పోస్ట‌ర్లు, వాల్‌రైటింగ్‌లు, బ్యాన‌ర్లు పెట్టేవారిని గుర్తించి దాదాపు 3.48 ల‌క్ష‌ల అతిక్ర‌మ‌ణ‌ల‌పై జ‌రిమానా విధించ‌డం జ‌రిగింది. నిషేదించిన ప్లాస్టిక్ విక్ర‌యాన్ని అరిక‌ట్టేందుకు బేగంబ‌జార్ నందు, ఉత్ప‌త్తిని నివారించేందుకు కాటేదాన్‌లోని యూనిట్ల‌పై త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నాం. 10ల‌క్ష‌ల ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింది.

*యు.సి.డి:*  న‌గ‌రంలో ఉన్న 1,466 మురికివాడ‌ల్లో 18ల‌క్ష‌ల జ‌నాభా నివ‌సిస్తున్న‌ది. వాటిలో 14.80 ల‌క్ష‌ల మంది 1156 నోటిఫైడ్ స్ల‌మ్‌ల‌లో ఉంటున్నారు. మురికివాడ‌ల్లోని ప్ర‌జ‌ల ఆర్థికాభివృద్దికి 51,051 ఎస్‌.హెచ్‌.జిలు ప‌నిచేస్తున్నాయి. వాటిలో ఈ సంవ‌త్స‌రం 1,942 గ్రూపులు ఏర్పాట‌య్యాయి. 1240 స్ల‌మ్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్లు, 29 టౌన్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్లు ప‌నిచేస్తున్నాయి. 2019లో 6,949 గ్రూపుల‌కు రూ. 287 కోట్ల బ్యాంకు లింకేజి క‌ల్పించ‌డం జ‌రిగింది. అలాగే 12 కోర్సుల‌లో 980 మంది నిరుద్యోగ యువ‌త‌కు శిక్ష‌ణ ఇప్పించ‌గా, వారిలో 106 మందికి ప్లేస్‌మెంట్ ల‌భించింది. న‌గ‌రంలో చిరు వ్యాపారాలు చేస్తున్న 24,909 మంది స్ట్రీట్ వెండ‌ర్స్‌ను గుర్తించి, 24,811 మందికి గుర్తింపు కార్డులు జారీచేయ‌డం జ‌రిగింది. 30 టౌన్ వెండింగ్ క‌మిటీలు, 234 కామ‌న్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఏర్పాటు చేశాం. 138 వెండింగ్ జోన్స్‌ను మార్కింగ్‌చేశాం. 300మంది స్ట్రీట్ వెండ‌ర్స్‌కు హోట‌ల్ మేనేజ్‌మెంట్ సంస్థ‌చే ఫుడ్ సేఫ్టిపై శిక్ష‌ణ ఇప్పించ‌డం జ‌రిగింది. ఆస‌రా కింద 2019లో 6,491 మంది సీనియ‌ర్ సిటీజ‌న్ల‌కు గుర్తింపు కార్డులు జారీచేశాం. వికాసం కింద 2019లో 111 దివ్యాంగ ఎస్‌.హెచ్‌.జిల‌కు రూ. 1.54 కోట్ల బ్యాంకు లింకేజి క‌ల్పించాం.

* దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఎంట‌మాల‌జి విభాగం ద్వారా 642 బృందాలచే యాంటి లార్వా ఆప‌రేష‌న్లు, 150 పోర్ట‌బుల్, 13 వాహ‌నాల ద్వారా ఫాగింగ్ మిష‌న్ల‌చే రోజువారి చ‌ర్య‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌ధానంగా 15 చెరువుల‌లో గుర్ర‌పుడెక్క తొల‌గించి దోమ‌ల నివార‌ణ‌కు ఆయిల్ బాల్స్ వ‌ద‌ల‌డం జ‌రిగింది. 513 చెరువులు, బావుల‌లో 58వేల గంబూసియా చేప‌ల‌ను వ‌ద‌ల‌డం జ‌రిగింది. ప్ర‌యోగాత్మ‌కంగా చెరువులు, మూసి న‌దిలో దోమ‌ల నియంత్ర‌ణ‌కు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ చేయ‌డం జ‌రిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com