మెరీనాలో డేగకన్ను భద్రత..
- January 17, 2016
మెరీనాలో డేగకన్ను భద్రత 12వేల మంది పోలీసులతో గస్తీ చిన్నారులకు ప్రత్యేక పాస్‌లు విహార ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చెన్నై: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు కనుమ పండుగను రాష్ట్ర వాసులు జరుపుకోనున్నారు. ఈ పండుగ సమయంలో నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు నగర వాసులు తండోపతండాలుగా తరలివెళ్లనున్నారు. దీంతో స్థానిక మెరీనాతీరంతో పాటు.. నగరంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. వీరంతా డేగ కన్నుతో భద్రతను పర్యవేక్షించనున్నారు. అదేసమయంలో భారీ రద్దీలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు వీలుగా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయనున్నారు. ఇదే విషయంపై నగర పోలీసు యంత్రాంగం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆనందంతో పాటు అప్రమత్తత ముఖ్యం కనుమ పండుగ సందర్భంగా నగర వాసులు తమ కుటుంబ సభ్యులతో మెరీనా, బీసెంట్ నగర్, గిండి నేషనల్ పార్కు, ఐల్యాండ్ మైదానంలో ఏర్పాటు చేసిన తమిళనాడు పర్యాటక ప్రదర్శన, ఈసీఆర్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పర్యాటక కేంద్రాలకు వెళ్ళడం ఆనవాయితీ. ఈ ప్రాంతాలకు వెళ్ళే నగర వాసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. కనుమ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 12 వేల మందితో భారీ భద్రతను కల్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు. మెరీనాలో 2 కంట్రోల్ రూంలు స్థానిక మెరీనాతీరంలో రెండు తాత్కాలిక పోలీసు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటి సమీపంలో రెండు పోలీసు హెల్ప్ సెంటర్లు కూడా ప్రారంభించారు. అత్యవసర సేవల కోసం రెండు ఆంబులెన్స్‌లు, వైద్య సహాయ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. శ్రామికుల విగ్రహం నుంచి లైట్‌హౌస్ వరకు ఖాళీ ప్రదేశంలో 6 తాత్కాలిక టవర్లను ఏర్పాటు చేసి, ఒక్కో టవర్‌పై ముగ్గురేసి పోలీసులు బైనాక్యులర్ కెమెరాలతో నిశితంగా పర్యవేక్షించనున్నారు. అలాగే కనుమ పండుగ రోజున సముద్ర స్నానాలను నిషేధించారు. సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయే వారిని రక్షించేందుకు వీలుగా వందమంది గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచారు. చిన్నారులకు గుర్తింపు కార్డులు కనుమ పండగ రోజున మెరీనా, ఎలియట్స్ బీచ్‌లకు వచ్చే చిన్నారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. అలాగే, వెంట తీసుకుని వచ్చే తమ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరింది. తల్లిదండ్రుల వెంట వచ్చే చిన్నారులను పోలీసులు ఆపి.. వారి పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబరుతో కూడిన వివరాలను పొందుపరిచిన గుర్తింపు కార్డును అందజేస్తామని నగర పోలీసుశాఖ పేర్కొంది. విహార ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కనుమ సందర్భంగా నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు విహార ప్రాంతాలకు తండోపతండాలుగా రానున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మెరీనాబీచతో పాటు గిండిలోని చిల్డ్రన్స పార్క్, వండలూరులోని జంతు ప్రదర్శనశాల, స్నేక్ పార్క్, మొసళ్ల పార్కు, గోల్డెన్‌బీచ్, వీజీపీ తదితర ప్రదేశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







