నిర్భయ కేసు: ఉరి శిక్షకు ఇలా ఏర్పాట్లు..! దోషుల పట్ల స్పెషల్ కేర్..!

- January 09, 2020 , by Maagulf
నిర్భయ కేసు: ఉరి శిక్షకు ఇలా ఏర్పాట్లు..! దోషుల పట్ల స్పెషల్ కేర్..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారైంది... పటియాల హైకోర్టు నిర్భయ కేసులో అత్యాచారానికి పాల్పడిన దోషులకు జనవరి 22వ తేదీన ఉరిశిక్ష ఖరారు చేయడంతో... ఆ నలుగురు దోషులకు ఈ విషయం తెలిసి జైలులో గొల్లుమని ఏడ్చినట్టు తీహార్ జైలు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక, జనవరి 22న ఆ నలుగురు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు... మరోవైపు దోషులను ప్రతీక్షణం గమనిస్తూ వారిని స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు.

ఆ నలుగురు దోషులను ఐసోలేటెడ్ జైళ్లలో ఉంచుతారు జైలు అధికారులు.. ఇకపైన వారితో చేయించే రోజువారి జైలు పని చేయించరు... ఉరిశిక్ష పడే వరకు నలుగురిని విడివిడిగా కండమ్ సెల్‌లో ఉంచనున్నారు.. ఇక, 24 గంటలు వీరిని జైలర్ పర్యవేక్షిస్తూ ఉంటారు.. 22న ఉరి శిక్ష పడేంత వరకు వీరితో ఎవ్వరూ మాట్లాడరు... అలాగే వీరిని ఎవరితో కలవనివ్వరు.. క్షణక్షణం మృత్యువు గురించి మాత్రమే ఆలోచించేలా పరిస్థితులు కల్పిస్తారు జైలు అధికారులు.. అంతేకాకుండా ఉరిశిక్ష అమలు అయ్యేంతవరకు ఈ నలుగురు దోషుల శారీరిక మానసిక ఆరోగ్య పరీక్షలు జరుపుతూ ఉంటారు. ఈ నలుగురు దోషులకు దగ్గర ఏమైనా ఆస్తి ఉంటే ఆస్తి ఎవరి పేరున రాయాలి అనుకుంటున్నారు అని కనుక్కుని ఆ మేరకు వారితో విల్లు రాయిస్తారు... వారి చివరి కోరికను అడిగి తెలుసుకుంటారు.. అలాగే తమ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని మాత్రమే కలవాలి అనుకుంటే ఒక్కసారి మాత్రమే కలవడానికి అవకాశం కల్పిస్తారు.

మరోవైపు వీరి ఉరిశిక్ష అమలు చేయడానికి మరో జైలు నుంచి ఉద్యోగిని రప్పిస్తున్నారు... ఉత్తరప్రదేశ్ నుంచి ఉరి తీసే ఉద్యోగి వచ్చి వీరి ఉరిశిక్షను అమలు చేస్తారు. తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేసే ఉద్యోగి లేకపోవటంతో యూపీ నుంచి ఉద్యోగిని పిలిపించేందుకు ఏర్పాట్లు చేశారు తీహార్ జైలు అధికారులు.. అయితే, ఆ ఉద్యోగి ఒకరోజు ముందుగానే.. అంటే 21వ తేదీనే ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ముందు ఓసారి డమ్మీలను పెట్టి ఉరి తీసే ప్రక్రియను ప్రాక్టీస్ చేస్తారు.. గతంలో ఎప్పుడూ కూడా నలుగురికి ఒకేసారి ఉరి తీయాల్సిన పరిస్థితి రానందున ఉరితీసే ప్లాట్‌ఫామ్ చిన్నదిగా ఉంది... దీంతో నిర్భయ కేసులో నలుగురు దోషులను ఒకే సమయంలో ఉరి తీయాలని తీర్పు ఉండటం వలన ఉరితీసే ప్లాట్‌ఫామ్‌ను పెద్దగా తయారు చేశారు. ఇక, ఉరి తీసే ప్రత్యేకమైన తాడును బాక్సర్ నుంచి ఇప్పటికే తీహార్ జైలుకు తెప్పించారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com