ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నిబంధనల్లో 71వ నిబంధన..అసలు ఈ రూల్ 71 ఏంటి?
- January 22, 2020
రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని ఈ నిబంధన శాసన మండలి సభ్యులకు ఇస్తోంది. దీని ప్రకారం.. ఏదైనా మంత్రిత్వ శాఖ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా సభ్యుడు చైర్మన్ అనుమతితో తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
అయితే, ఆ రోజు సభా కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరాలి. ఈ మేరకు సంబంధిత సభ్యుడు, సంబంధిత తీర్మానాన్ని లిఖితపూర్వక నోటీసు రూపంలో శాసన మండలి కార్యదర్శికి అందజేయాలి.
ఈ నోటీసు నిబంధనలకు అనుగుణంగానే ఉందని చైర్మన్ భావిస్తే.. దానిని చదివి సభలోని మిగతా సభ్యులకు వినిపించాలి. దీనికి ఎంత మంది మద్దతు ఇస్తున్నారో.. ఆయా సభ్యులంతా తమతమ స్థానాల్లో నిలబడాలని కోరాలి.
ఒకవేళ తీర్మానం నోటీసుకు అనుకూలంగా 20 మంది లేదా అంతకు మించి సభ్యులు అనుకూలంగా ఉంటే, సదరు తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలి. తీర్మానం నోటీసులో కోరిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోపు, లేదంటే సభా సమావేశాలను నిరవధిక కాలంపాటు వాయిదా వేసేలోపు ఎప్పుడైనా ఒకరోజు ఈ చర్చను చైర్మన్ అనుమతించాలి. ఒకవేళ తీర్మానానికి అనుకూలంగా కనీసం 20 మంది సభ్యులు కనుక లేచి నిలబడకపోతే అప్పుడు ఆ తీర్మానం నోటీసు చెల్లదని చైర్మన్ ప్రకటిస్తారు.
టీడీపీ, వైసీపీల వ్యూహాలు ఏంటి..?
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు శాసన మండలిలో కనుక ఆమోదం పొందకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చరిత్రలో తొలిసారి రూల్ 71ను ఉపయోగించి తీర్మానాన్ని పెట్టింది.
శాసన మండలిలో మొత్తం స్థానాల సంఖ్య 58.
ఇందులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది. టీడీపీ ఎమ్మెల్సీలు 34 మంది. అధికార వైసీపీ ఎమ్మెల్సీలు 9 మంది కాగా, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరుగురు, స్వతంత్ర ఎమ్మెల్సీలు ముగ్గురు, బీజేపీ ఎమ్మెల్సీలు ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
మండలి ఆమోదించకపోతే బిల్లు ఏమౌతుంది..?
వాస్తవానికి మూడు రాజధానుల బిల్లుపై ఇంకా శాసనమండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వం ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్టింది. దీనికి వ్యతిరేకంగా టీడీపీ పెట్టిన రూల్ 71 తీర్మానంపైనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ తీర్మానం తర్వాత బిల్లును చర్చకు స్వీకరించి, దానిని శాసన మండలి వ్యతిరేకిస్తే.. ఆ బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళుతుంది. నిబంధనల ప్రకారం.. రెండోసారి అదే బిల్లును శాసనసభ ఆమోదిస్తే, మళ్లీ బిల్లు శాసన మండలికి వెళుతుంది. రెండోసారి కూడా మండలి బిల్లును తిరస్కస్తే, నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. దీనికి గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత చట్టంగా మారుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు