విశాఖపట్నం చుట్టుపక్కల ల్యాండ్ పూలింగ్ కు ఉత్తర్వులు జారీ

- January 29, 2020 , by Maagulf
విశాఖపట్నం చుట్టుపక్కల ల్యాండ్ పూలింగ్ కు ఉత్తర్వులు జారీ

విశాఖను ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. విశాఖపట్నం చుట్టుపక్కల ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ చుట్టుపక్కల 10 గ్రామాల్లో 6వేల 116 ఎకరాల సేకరణకు జీవో నెంబర్ 72 జారీ చేసింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. దీంతో ఆ మండలాల పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఇప్పటికే అధికారుల హడావుడి మొదలైంది.

యుద్ధ ప్రాతిపదికన ల్యాండ్ పూలింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్‌ కింద సేకరించే భూములను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-VMRDAకి అప్పగించనున్నారు. ఆ స్థలాల్లో ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వనుంది వీఎంఆర్డీఏ. ఇల్లు లేని పేదలందరికీ గృహాలు నిర్మించాలన్న ఉద్దేశంతోనే ల్యాండ్ పూలింగ్‌ చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిని సైతం ఖాళీ చేయించి.. VMRDA అభివృద్ది చేసే ప్లాట్లను వారికి కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

ల్యాండ్‌ పూలింగ్‌ రాజధానిలో కార్యాలయాల నిర్మాణానికి కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నవరత్నాల అమల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు స్కీం కోసం భూసేకరణ చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అది రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే పథకం కాగా.. విశాఖపట్నం జిల్లాలో మాత్రమే భూసేకరణకు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకించిన వైసీపీ ప్రభుత్వం.. విశాఖలో ఇంత భారీ ఎత్తున ఎందుకు ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తోందని ప్రశ్నిస్తున్నాయి.

అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌కు వ్యతిరేకమన్న జగన్‌… వైజాగ్‌లో జీవో ఎలా ఇచ్చారని ప్రశ్నించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. రాజధాని తరలింపునకు ముందు… అమరావతి రైతులకు సమాధానం చెప్పాలన్నారు.

ల్యాండ్‌ పూలింగ్‌ మొదలెడితే మళ్లీ భూదందాల బెడద తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులను ప్రభుత్వం కట్టడి చేయడం కష్టమే అంటున్నారు మాజీ IAS అధికారి EAS శర్మ. విశాఖలో చట్టబద్ధంగా చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com