మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... బస్సు టైరు పేలడంతో 20 మంది జలసమాధి...!

- January 29, 2020 , by Maagulf
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... బస్సు టైరు పేలడంతో 20 మంది జలసమాధి...!

ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అతి వేగం కారణంగా, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో అమాయకులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో బస్సు టైరు పేలి బస్సు అదుపు తప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయినట్టు సమాచారం. వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టడంతో బస్సు వేగంగా వెళ్లి బావిలో పడింది. బస్సు టైరు పేలిపోవడం వలనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బస్సు బావిలో పడటంతో బస్సులో నుండి బయటకు రాలేక ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బస్సు టైరు పేలడం వలనే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 20 మంది ప్రయాణికులు మృతి చెందగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. నాసిక్ లోని మాలేగావ్ నుండి కల్వాన్ కు బయలుదేరిన బస్సుకు ఈ ప్రమాదం జరిగింది.. బస్సు టైరు పేలి ఆటోను ఢీ కొట్టడంతో 70 అడుగుల లోతు ఉన్న బావిలో బస్సు పడిపోయింది.బస్సు బావిలో పడిపోవడంతో సహాయక చర్యల విషయంలో కొంత ఆటంకం కలుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com