ఎన్నార్సీ అమలుపై వివరణ ఇచ్చిన కేంద్ర హోం శాఖ

- February 04, 2020 , by Maagulf
ఎన్నార్సీ అమలుపై వివరణ ఇచ్చిన కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) అమలు విషయంపై కేంద్రం మంగళవారం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ... ''ఇప్పటి వరకు ఎన్నార్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు'' అని లోక్‌సభలో విపక్షాలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్నార్సీ చేపట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాగా బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీపై చర్చ జరగాలంటూ విపక్షాలు సోమవారం పట్టుబట్టిన విషయం తెలిసిందే. 

ఈ రెండు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. వీటిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేంత వరకు బడ్జెట్‌పై చర్చింబోమంటూ కాంగ్రెస్‌ పార్టీ సహా డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ ఎన్నార్సీపై వివరణ ఇచ్చింది. ఎన్నార్సీ అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక సీఏఏ తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామంటూ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో... మాట మార్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నార్సీ అమలు చేయబోమని తెలిపారు.

ఇదిలా ఉండగా.. జాతిపిత మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వంపై తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com