వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

- February 07, 2020 , by Maagulf
వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

వరంగల్:మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. అమ్మల దీవెనలు తెలంగాణలోని ప్రతీ బిడ్డ మీద ఉండాలని సీఎం కోరారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ఉన్నారు. తల్లులకు సీఎం నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. హుండీలో కానుకలు వేశారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క-సారలమ్మ దేవతల ఫోటో అందజేశారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరెన్నికగన్న విషయం తెలిసిందే. అశేష భక్తజనం రాకతో మేడారం పరిసరాలు జన సునామీని తలపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com