స్పెయిన్ తీసుకున్న ఆ నిర్ణయం..

- March 17, 2020 , by Maagulf
స్పెయిన్ తీసుకున్న ఆ నిర్ణయం..

కరోనా ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది. చైనా తరువాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తన ప్రభావాన్ని అధికంగా చూపుతోంది. అక్కడి వాతావరణ చల్లగా ఉండటంతో.. వైరస్ కంట్రోల్ అవ్వడం లేదు. అయితే ఈ మహమ్మారిని ఎలాగైనా కట్టడి చేయాలని యూరప్ దేశం స్పెయిన్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెయిన్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలన్నింటిని జాతీయం చేసింది. దీంతో ఆ దేశంలో అన్ని ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లాగా పనిచేయనున్నాయి. అంతేకాదు కరోనా బాధితులు ఇప్పుడు స్పెయిన్‌లోని ఏ ఆస్పత్రికి వెళ్లినా ఖర్చులన్నీ ఫ్రీ. ఈ చర్య వలన కరోనా బాధితుల నుంచీ ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. ఇక ఈ నిర్ణయాన్ని ఆ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.

కాగా మంగళవారానికి స్పెయిన్‌లో కరోనా బాధితుల సంఖ్య 9,942కు చేరింది. 342మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గత వారమే స్పెయిన్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని స్కూళ్లు, పబ్లిక్ ప్రదేశాలు, పార్కులు, మాళ్లు, థియేటర్లూ మూసేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచీ బయటకు రావొద్దని ప్రజలకు చెప్పింది. రాజధాని మాడ్రిడ్‌లో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు (మెడికల్ షాపులు) తప్ప అన్నీ మూతపడ్డాయి. అధికారులు డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసించదగ్గ విషయమే. కాగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా సాంచెజ్ కి కూడా  కోవిడ్-19 సోకిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com