కరీంనగర్‌లో 8 మందికి కరోనా పాజిటివ్...

- March 19, 2020 , by Maagulf
కరీంనగర్‌లో 8 మందికి కరోనా పాజిటివ్...

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020) ఒక్క రోజే 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకింది. ఒకేసారి ఏడు మందికి కరోనా సోకడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అప్రమత్తమైన అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కలెక్టరేట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హోటళ్లు, దుకాణాలు మూసివేశారు.

4 మసీదులు, రెండు హోటళ్లలో కరోనా బాధితులు బస:

దీనిపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు నగరంలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. మత ప్రచారకులు నగరంలోని 4 మసీదులకు వెళ్లినట్లు, రెండు హోటళ్లో బస చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకా వారు ఎక్కడెక్కడ నమాజు చేశారు, ఎవరిని కలిశారు అనే వివరాలు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. గురువారం(మార్చి 19,2020) సాయంత్రానికి దీనిపై ఒక క్లారిటీ వస్తుందన్నారు.

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు:
కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దన్నారు. కొత్త వారిని కలవొద్దన్నారు. ఒక వేళ బయటకు రావాల్సి వస్తే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలన్నారు. వ్యక్తి వ్యక్తి మధ్య ఒకటిన్నర మీటరు దూరం కచ్చితంగా పాటించాలన్నారు. కరోనా కేసులు నమోదు కావడంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి 100 వైద్య బృందాలు:
కరోనా పంజా నేపథ్యంలో 100 ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపినట్టు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గురువారం కరీంనగర్ నగరంలోని ప్రతి ఇంటికి వైద్య బృందం వెళ్తుందని, ప్రతి ఒక్కరికి నిర్బంధ వైద్య పరీక్షలు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారిని వెంటనే హైదరాబాద్ గాంధీకి తరలిస్తామన్నారు. అక్కడి చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు గుంపులుగా తిరగొద్దని మంత్రి రిక్వెట్ చేశారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

* కరీంనగర్ జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణం
* జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు
* రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 బెడ్లు సిద్ధం
* కరీంనగర్ కు 100 ప్రత్యేక వైద్య బృందాలు
* కరీంనగర్ లో ఇంటింటికి వెళ్లి నిర్బంధ వైద్య పరీక్షలు

* కలెక్టరేట్ సమీపంలో ఇండోనేషియా బృందం బస
* ఇండోనేషియా బృందానికి(11మందిలో ఏడుగురికి) కరోనా సోకినట్టు నిర్ధారణ
* 4 మసీదుల్లో ప్రార్థనలు, 2 హోటళ్లలో బస
* 8మందితో సన్నిహితంగా ఉన్న ఇండోనేషియా బృందం

* కలెక్టరేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ అమలు
* కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రహదారి మూసివేత
* కరీంనగర్ లో హోటళ్లు, దుకాణాలు బంద్
* ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆదేశం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com