కరోనాపై కేంద్రానికి కేసీఆర్ కీలక సూచనలు

- March 20, 2020 , by Maagulf
కరోనాపై కేంద్రానికి కేసీఆర్ కీలక సూచనలు

హైదరాబాద్:హైదరాబాద్ లోని సిసిఎంబి (Centre for Cellular and Molecular Biology)ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ గా ఉపయోగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. కేవలం తెలంగాణలోని వారికే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడి వారికైనా పెద్ద సంఖ్యలో ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. సిసిఎంబి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. దీన్ని జీవసంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తే ఒకే సారి వెయ్యి శాంపిల్స్  పరీక్షించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తెచ్చారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వైరస్ వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగానే సిసిఎంబి గురించి సిఎం వివరించారు. 

భారత్ దేశంలోని అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, చెన్నై, బెంగులూరు, హైదరాబాద్ లకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి ప్రయాణీకులు వస్తారని, వారిని క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ జనసమ్మర్థం ఉండే ఈ నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున, కొద్ది రోజుల పాటు విదేశాల నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిలిపి వేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రైళ్ల ద్వారా ప్రయాణం చేసే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్ల వద్ద పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, రైలు బోగీలలో హై సానిటేషన్ నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జనం గుమిగూడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, శ్రీరామ నవమి, జగ్నే కీ రాత్ లాంటి పండుగల సందర్భంగా కూడా ఉత్సవాలు బంద్ చేసినట్లు వివరించారు. కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com