తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతం--కె.సి.ఆర్

- March 25, 2020 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతం--కె.సి.ఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్నదని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్సింగ్ కు మించిన మార్గం లేదని, కాబట్టి లాక్ డౌన్ ను విధిగా పాటించాలని సీఎం ప్రజలను కోరారు.

రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ కార్యదర్శి  రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు తన కార్యాలయంలోనే ఉండి సీఎం పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, వైద్య శాఖల సీనియర్ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని సీఎం అధికారులను కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి విషయంలో, క్వారంటైన్ లో ఉన్న వారి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని కాపాడవచ్చని సీఎం పిలుపునిచ్చారు. ఎవరికి అనుమానం కలిగినా, వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బందిని, సానిటరీ ఉద్యోగులను సీఎం అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com