వెస్ట్ బెంగాల్:ఆ ఏడుగురు పేదలు చెట్లపై స్వీయ నిర్బంధం..ప్రపంచానికే ఆ యువకులు ఆదర్శం
- March 28, 2020

వెస్ట్ బెంగాల్:ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న వేళ కొందరు బడా బాబుల నిర్వాకం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. గొప్ప చదువులు..అంతకంటే గొప్ప ఉద్యోగాలని పొంగిపోయిన ఎన్ఆర్ఐలు ఒక్క కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్నారు. 14 రోజులు నిర్బంధంలో ఉండి దేశభక్తిని చాటుకోవాల్సిన ఎన్ఆర్ఐలు..ప్రభుత్వ నిర్బంధాన్ని తప్పించుకునేందుకు అనేక దొంగ మార్గాలను అవలంభిస్తూ తమని తాము మోసం చేసుకుంటున్నారు. తమ కుటుంబాలను, చుట్టుపక్కల జనాలను మోసం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు పరోక్ష హంతకులుగా మారిపోతున్నారు. చదువుకున్నోళ్లు, స్వీయ నిర్బంధానికి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నవారు కూడా ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టి కేవలం తమ స్వార్ధం, జల్సాల కోసం వైరస్ కారకాలుగా మారిపోతున్నారు. ఇలాంటి వాళ్లందరికి చెంప చెల్లుమనిపించేలా ఓ ఏడుగురు నిరుపేద యువకులు దేశభక్తిని చాటుకుంటున్నారు. తమ కుటుంబం, గ్రామం కోసం తమకు ఏమైనా పర్వాలేదనుకున్నారు. ఏ సౌకర్యం లేకున్నా...అటవి మృగాలు దాడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఊళ్లోకి అడుగుపెట్టకుండా ఓ చెట్టుపైనే స్వీయ నిర్బంధాన్ని(క్వారంటైన్) ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కథనంపైన కనిపిస్తున్న చిత్రం పశ్చిమబెంగాల్ లోని పురూలియా జిల్లాలోని భంగిదిహ్ గ్రామంలోనిది. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు చెన్నైలో కూలి పని చేసుకొని పొట్టపోసుకునేవారు. అయితే..జనతా కర్ఫ్యూ ముందు రోజే వీళ్లంతా రైల్ లో బయల్దేరారు. ఖరగ్ పూర్ చేరుకోగానే ఎందుకైనా మంచిదని ఆస్పత్రికి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ టెస్ట్ లో వారికి కరోనా లక్షణాలేవి లేవని నిర్ధారణ అయింది. అయినా..ఎందకైనా మంచిదని 14 రోజులు స్వీయ నిర్బంధం పాటించాలని డాక్టర్లు సూచించారు. కానీ, నిర్బంధం పాటించేందుకు వారి ఇళ్లలో వారికి తగిన సౌకర్యాలు లేవు. ఆ ఏడుగురి కుటుంబాలు ఒక గది ఇళ్లలో, పూరి గుడిసెల్లో ఉంటున్నారు. అయితే..ప్రపంచవ్యాప్తంగా కరోనా బీభత్సం గురించి తెల్సుకున్న ఆ ఏడుగురు యువకులు తమ కుటుంబాలు, గ్రామ ప్రజల బాగుకోసం స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. ఊరి వెలుపలే ఉన్న మామిడి చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకున్నారు. దోమల నుంచి రక్షించుకునేందుకు దోమల తెరతో చిన్న గదిలా మంచె ఏర్పాటు చేసుకున్నారు. చెట్టు కింద ప్రత్యేకంగా గుడిసె వేసుకునే అవకాశం ఉన్నా..అది అటవీ ప్రాంతం కావటంతో తరచుగా ఎనుగులు దాడి చేస్తుంటాయి. పక్కనే ఉన్న గుట్ట మీద చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు తరచుగా కనిపిస్తుంటాయి. పాముల నుంచి కూడా వారికి ప్రమాదం పొంచి ఉంది. అయినా..వారు అవన్ని లెక్క చేయకుండా చెట్టుపై నిర్బంధం ఏర్పాట్లు చేసుకున్నారు. తమ కోసం అంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఆ యువకులకు గ్రామం కూడా బాసటగా నిలిచింది. బాణాలతో వారికి కాపాల కాస్తున్నారు. రోజుకు కొందరు వారికి రక్షణగా ఈలలు వేస్తూ, డప్పులు కొడుతూ అటవీ మృగాల నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ఇక రోజు వారికి ఆహారం తీసుకొచ్చే కుటుంబ సభ్యులను కూడా తమ దగ్గరికి రానివ్వటం లేదు ఆ యువకులు. చెట్టు కిందే ఆహారం పెట్టి వెళ్లిపోవాలి. వారు వెళ్లిపోయాక చెట్టు దిగి భోజనం చేస్తున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. చదువుకున్న మూర్ఖుల కంటే ఆ ఏడుగురు యువకులు ఎంతో నయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. తోటి వారి బాగుకోసం వారి తపనకు ముచ్చటపడిపోతున్నారు. విదేశాల్లో వైరస్ అంటించుకొని పబ్బులు, క్లబ్బులు, పార్టీలు తిరిగే సింగర్ కనిక కపూర్ కంటే ఈ యువకులు అసలైన దేశ పౌరులని నెటిజన్లు కితాబిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







