కువైట్:జనంలో కరోనా ఫోబియా..సాధారణ జలుబు, దగ్గు వచ్చినా జనంలో హైరానా

- April 03, 2020 , by Maagulf
కువైట్:జనంలో కరోనా ఫోబియా..సాధారణ జలుబు, దగ్గు వచ్చినా జనంలో హైరానా

కువైట్:ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఏ మూలకు వెళ్లినా కరోనా వైరస్ భయమే కనిపిస్తోంది. చివరికి పక్క మనిషి తుమ్మినా, దగ్గినా వైరస్ సోకిందేమోనని అనుమానం చూస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ లో కరోనా ఫోబియా మోతాదు కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తోంది. కువైట్ లో ప్రస్తుతం వసంత రుతువు వచ్చింది. దీంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సాధారణంగా వచ్చే అలర్జీ, జలుబుకు కూడా జనం హైరానా పడుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలను పోలి ఉండటంతో తమకు కూడా వైరస్ సోకిందనే అనుమానంతో భయపడిపోతున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరంతో పాటు పొడి దగ్గు, జలుబు, తమ్ములు, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, అలసగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే..సీజనల్ గా వచ్చే జలుబులో కూడా కరోనా లక్షణాల్లో కొన్ని ఉంటాయి. జలుబు, తుమ్ములు, తలనొప్పి, జ్వరం ఉంటాయని కువైట్ కార్డియాక్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ అల్ షోమర్ అన్నారు. అంత మాత్రాన జలుబు ఉన్నవాళ్లందరికీ కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారామె. అయితే..ప్రస్తత సంక్షోభ పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తరచుగా సీజన్ వ్యాధులకు గురయ్యేవారు, అస్తమా లాంటి రోగాలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ల సలహా పాటించి సరైన సమయంలో మెడిసిన్ వాడాలని సూచించారు. ఎవరెవరికి ఏయే వస్తువులు, వాతావరణం అలర్జీకి కారణం అవుతాయో వాటికి దూరంగా ఉండాలని, అలర్జీ కలగించే ఆహారం మానివేయాలని, అలాగే కొందరికి కొన్ని రకాల వాసనలు పడవని అలాంటి వారు తమకు ఎలాంటి వాసనలతో అలర్జీ వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు తేమ వాతావరణానికి దూరంగా ఉండాలన్నారు.  

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com