యూఏఈ: లాక్ డౌన్ తర్వాతే ఇండియా వెళ్లేందుకు అనుమతి...

- April 12, 2020 , by Maagulf
యూఏఈ: లాక్ డౌన్ తర్వాతే ఇండియా వెళ్లేందుకు అనుమతి...

అబుధాబి:లాక్ డౌన్ ముగిసే వరకు ప్రవాసీయులు ఎవరికీ భారత్  వెళ్లే అవకాశమే లేదని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసేందుకు భారత్ ప్రస్తుతం కట్టుదిట్టమైన నిబంధనలు అమలులో ఉన్నాయని, దేశమంతా పూర్తిగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయని, ఈ సమయంలో ప్రభుత్వం ప్రవాసీయులను దేశంలోకి అనుమతిని ఇచ్చే ఉద్దేశంతో లేదని భారత రాయబారి పవన్ కపూర్ స్పష్టత ఇచ్చారు. అయితే..భారత ప్రభుత్వ ఉద్దేశం ప్రవాసీయులను అలక్ష్యం చేయటం కాదని కూడా ఆయన తెలిపారు. కేవలం కరోనా కట్టడి కోసం అటు దేశ ప్రజలు, ఇటు ప్రవాసీయుల కుటుంబాలు బాగుండాలనే యోచనే తప్ప ప్రవాసీయులను పట్టించుకోవడం అనే ప్రస్తావనే లేదని ఆయన వివరించారు. విదేశాల నుంచి భారత్ కు తిరిగి వెళ్తున్న ప్రవాసీయుల్లో ముందుగా కరోనా నెగటీవ్ వచ్చినా కూడా కొద్ది రోజుల తర్వాత వారిలో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతున్న కేసులను పవన్ కపూర్ ఉదాహరణ చెప్పుకొచ్చారు. 

అంతేకాకుండా విదేశాల నుంచి భారత్ కు వస్తున్న ప్రవాసీయుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని...ఈ పరిణామం కరోనా కట్టడి విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల ప్రయోజనాల కోసం విదేశాల్లోని భారతీయులు ఎక్కడివారు అక్కడే ఉండటం ఎంతో శ్రేయస్కరమని ఆయన హితువుపలికారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే దశల వారీగా ప్రవాసీయులను తరలిస్తామన్నారు.

యూఏఈలోని భారతీయుల సంరక్షణ తమ బాధ్యతని, వారిని అన్ని రకాలు సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. అందుకు యూఏఈ అధికారులు కూడా తోడ్పాటు అందిస్తారని తాను విశ్వస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు విదేశీయులు అందరికీ ఆరోగ్య సంరక్షణ కోసం యూఏఈ అధికార వర్గాలు తగిన చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. అలాగే కోవిడ్ పై పోరాటంలో ప్రవాస భారతీయులు కూడా యూఏఈ అధికారులకు పూర్తి సహయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యాపారులు, విద్యా సంస్థ వర్గాలు అధికారుల కోరితే క్వారంటైన్ కోసం తమ భవనాలను కేటాయించాలని ఆయన కోరారు. ఇదిలాఉంటే వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికుల్లో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటికే పలు లేబర్ క్యాంప్స్ లు సందర్శించానని, కార్మికులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పవన్ కపూర్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com